కోహ్లీసేన.. 2021లో మారాలిక! 

ప్రపంచం మెచ్చిన పరుగుల రారాజులకూ కొదవలేదు. ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ను వణికించే పేసర్లూ ఉన్నారు. బ్యాటుతో సిక్సర్లు బాది బంతితో వికెట్లు తీసే ఆల్‌రౌండర్లూ ఫర్వాలేదు. ఆటగాళ్లెవరూ వ్యక్తిగత ప్రతిష్ఠకు పాకులాడటం లేదు. బృందస్ఫూర్తికీ తిరుగులేదు. ..

Updated : 01 Jan 2021 17:05 IST

కొత్త ఏడాదిలో చేయాల్సిన మార్పులివే

ప్రపంచం మెచ్చిన పరుగుల రారాజులకూ కొదవలేదు. ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ను వణికించే పేసర్లూ ఉన్నారు. బ్యాటుతో సిక్సర్లు బాది బంతితో వికెట్లు తీసే ఆల్‌రౌండర్లూ ఫర్వాలేదు. ఆటగాళ్లెవరూ వ్యక్తిగత ప్రతిష్ఠకు పాకులాడటం లేదు. బృందస్ఫూర్తికీ తిరుగులేదు. క్రీడాస్ఫూర్తికీ విఘాతం కలిగించడం లేదు. అధునాతన సౌకర్యాలు, అబ్బురపరిచే మౌలిక సదుపాయాలు, కోట్లలో జీతభత్యాలు, దిగ్గజాల శిక్షణ, అండగా నిలిచే క్రికెట్‌ బోర్డు..!

అన్నీ ఉన్నా మరో ప్రపంచకప్‌ గెలవలేకపోతోంది టీమ్‌ఇండియా. 2021లో టీ20 ప్రపంచకప్‌నకు స్వదేశమే ఆతిథ్యమిస్తోంది. మరి సొంతగడ్డపై భారత్‌ విశ్వవిజేతగా ఆవిర్భవించాలంటే జట్టులో మార్పులేం చేయాలి? టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలిచేందుకు ఏం అవసరం? విదేశీ గడ్డపై వరుస సిరీసులు కైవసం చేసుకొనేందుకు కావాల్సిందేంటి?


అస్థిరత్వం పోవాలి

ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో టీమ్‌ఇండియా ఒకటి. ఎక్కడైనా, ఎప్పుడైనా రాణించగలిగే సత్తాగల ఆటగాళ్లకు కొదవలేదు. ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌ ద్వారా కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం మిడిలార్డర్‌కు ఇంకా స్థిరత్వం రావడం లేదు. 4, 5, 6, 7 స్థానాలపై సందిగ్ధం వీడటం లేదు. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ దాదాపుగా కుదురుకున్నట్టే కనిపిస్తున్నాడు. జట్టు యాజమాన్యం అతడికీ బాగానే అవకాశాలిస్తోంది. అయితే మిగతా స్థానాలకు పోటీపడుతున్న మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌ నిలకడ సాధించాల్సివుంది. ఇక విజయ్ ‌శంకర్‌, హార్దిక్ ‌పాండ్య, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో పోటీకి నిలుస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా 4-7 స్థానాలపై కచ్చితమైన స్పష్టత రావాలి.


మరో పాండ్య కావాలి

టీమ్‌ఇండియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మరొకటి ఆల్‌రౌండర్ల కొరత. అటు బ్యాటు ఇటు బంతితో అత్యున్నత స్థాయి క్రికెట్లో రాణించగలిగిన ఆటగాళ్ల కోసం కోహ్లీసేన కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. హార్దిక్‌ పాండ్య జట్టులో ఇప్పటికే స్థిరపడ్డాడు. అయితే అతడు ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆసీస్‌ సిరీసులో నాలుగు ఓవర్లు తప్ప మళ్లీ బంతి ముట్టుకోలేదు. బ్యాటుతో మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగాడు. అచ్చం పాండ్యలాగే మరో ఆల్‌రౌండర్‌ జట్టుకు కావాలి. విజయ్‌శంకర్‌ రూపంలో మరో పేసర్‌ ఆల్‌రౌండర్‌ ఉన్నా అతడిలో ఆత్మవిశ్వాసం స్థాయి తక్కువ! ఒత్తిడికి చిత్తవుతున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌కు అవకాశమున్నా బ్యాటింగ్‌ పరంగా ప్రతిభ తక్కువ. హార్దిక్‌లా మరెవరూ ఫినిషర్‌ పాత్రను పోషించలేరు. ఇద్దరు పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉంటే జట్టుకు మరింత సమతూకం వస్తుంది.


తలనొప్పి పోవాలి

ఐపీఎల్‌లో భారీ సిక్సర్లు, చక్కని కీపింగ్‌తో అదరగొట్టిన పంత్‌ను చూసి ధోనీకి వారసుడిగా భావించారు. కానీ కొన్నాళ్లకే అతడు పోలికల సుడిగుండంలో చిక్కుకొని ఫామ్‌ కోల్పోయాడు. పైగా బరువూ పెరిగాడు. ప్రతిదాంట్లో ధోనీని అనుకరించాలన్న తపనతో కీపింగ్‌లో ప్రాథమిక అంశాల్లోనూ విఫలమయ్యాడు. తన విధ్వంసకర బాదుడుతో జట్టుకు ‘ఎక్స్‌-ఫ్యాక్టర్‌’గా మారతాడునుకుంటే జట్టులో చోటే దక్కించుకోలేక పోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ ఒడిసిపట్టాడు. బ్యాటింగ్‌, కీపింగ్‌లో చెలరేగుతున్న అతడికి ఇకపై ఢోకా ఉండకపోవచ్చు. సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ రూపంలో ప్రత్యామ్నాయాలూ కనిపిస్తున్నాయి. అత్యుత్తమ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహాతో పోటీ ఉంటోంది. రాహుల్‌ బాగానే అనిపిస్తున్నప్పటికీ సుదీర్ఘ కాలంలో అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపొచ్చు. కాబట్టి కీపింగ్‌ పరంగా సమస్యలను టీమ్‌ఇండియా త్వరగా పరిష్కరించుకోవాలి. పంత్‌లాంటి ప్రతిభావంతుడిని కాపాడుకోవాలి.


లోయర్‌ ‘పరుగులు’

ఏమాటకామాట! టీ20, వన్డే, టెస్టుల్లో ఆసీస్‌, ఇంగ్లాండ్‌, కివీస్‌తో పోలిస్తే టీమ్‌ఇండియా లోయర్‌ఆర్డర్‌ అత్యంత బలహీనం. ఇక ముందైనా కోహ్లీసేన ఈ జాడ్యాన్ని వదిలించుకోవాలి. అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తారన్నది నిజమే అయినా పరుగులు చేయడంలోనూ ఎంతో కొంత సాయపడాల్సిన అవసరమైతే ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజ్వేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌షమి పరుగులు చేయడం సాధారణంగా కనిపించదు. దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వంటి కుర్రాళ్లు బ్యాటు ఝుళిపించగలిగినా ఒత్తిడిలో చిత్తవుతున్నారు. అశ్విన్‌కు శతకాలు చేయగలిగే సత్తా ఉన్నా రెండేళ్లలో అతడు అర్ధశతకాలు సాధించిన దాఖలాలు తక్కువే. షమి అయితే ఏనాడూ పది పరుగులు చేద్దాం అన్న ధ్యాసలోనే కనిపించడు. బంతుల్ని అడ్డుకొని పరుగులు చేయగల ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ గాయాలతో జట్టులో ఉండటం లేదు. ఇక నటరాజన్‌, సిరాజ్‌, సైని భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.


అండ అవసరం

విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియా పగ్గాలు అందుకున్నప్పటి నుంచి జట్టులో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి. ప్రతి మ్యాచుకు ఎవరో ఒక ఆటగాడికి చోటు పోతోంది. మరొకరు వస్తున్నారు. ఫిట్‌నెస్‌ ఇబ్బందులు, గాయాల బెడద, పనిభారం కాబట్టి బౌలర్ల వరకు రొటేషన్‌ ఫర్వాలేదు. కానీ బ్యాటింగ్‌ విభాగంలో మాత్రం దెబ్బపడుతోంది. జట్టులో చోటుపై ఆటగాళ్లలో అభద్రతాభావం ఉన్నట్టు సమాచారం. ఏ నాయకుడైనా తన సహచరులకు అండగా నిలబడాలి. విఫలమవుతున్నప్పుడు ఆత్మవిశ్వాసం అందించాలి. కానీ కోహ్లీ-శాస్త్రి నేతృత్వంలో ఇదేమీ జరుగుతున్నట్టు అనిపించడం లేదని మాజీ క్రికెటర్లు పదేపదే విమర్శిస్తున్నారు. 2019 ప్రపంచకప్‌ ముందు నాలుగో స్థానంలో ఏ ఒక్కరికీ వరుస అవకాశాలు ఇవ్వకుండా నష్టం చేశారన్నది సత్యమే! పంత్‌కు వరుస అవకాశాలు ఇచ్చిన జట్టు యాజమాన్యం సంజుకు ఇవ్వలేదు. పంత్‌, సాహాను పదేపదే మారుస్తున్నారు. ఇది జట్టుకు కీడు చేస్తుందన్న విమర్శలూ వస్తున్నాయి. నాయకుడిగా కోహ్లీ తన తత్వం మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.


గాయాల బెడద

ప్రస్తుతం టీమ్‌ఇండియాను గాయాల బెడద వేధిస్తోంది. కోహ్లీ సారథ్యంలో ఫిట్‌నెస్‌ ప్రమాణాలు మెరుగైనప్పటికీ ఆటగాళ్లు ఈ ఏడాది విపరీతంగా గాయపడ్డారు. దాదాపుగా బౌలింగ్‌ విభాగమంతా విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి! గత మూడేళ్లలో ఎన్నడూ ఇలా లేదు. 2020 ఆరంభంలోనే రోహిత్‌శర్మ గాయపడ్డాడు. లాక్‌డౌన్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్‌ ఆడుతూ తొడకండరాల గాయంతో బాధపడ్డాడు. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌కు వెళ్లినా త్వరగా కోలుకోలేదు. ఈ మధ్యే ఫిట్‌నెస్‌ అందుకోవడంలో ఆసీస్‌కు వచ్చాడు. చల్లని వాతావరణం, చక్కని పిచ్‌ ఉంటే బెంబేలెత్తించగల స్వింగ్‌ బౌలర్ భువనేశ్వర్‌ తరచూ గాయపడుతున్నాడు. హార్దిక్‌ పాండ్య శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం గడిచినా అతడింకా బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ అందుకోలేదు. బుమ్రా సైతం గాయంతో మూణ్నెళ్లు విశ్రాంతి తీసుకున్నాడు. సీనియర్‌ పేసర్‌‌  ఇషాంత్‌ చాలాకాలం నుంచి అందుబాటులో లేడు. ఆస్ట్రేలియా సిరీసులో మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డారు. సిరాజ్‌, సైని, నటరాజన్‌, శార్దూల్‌ వంటి కుర్రాళ్లు ఉండటంతో సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఘోరంగా ఉండేది. ప్రపంచకప్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.


వివాదాలొద్దు

బీసీసీఐ, భారత జట్టు తరచూ వివాదాల్లో నలుగుతోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ అంశంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గతేడాది వృద్ధిమాన్‌ సాహా గాయపడ్డప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌ సరిగ్గా లేదని, నిపుణులు ఆటగాళ్ల గాయాల తీవ్రతను సరిగ్గా అంచనా వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య సొంతంగా కోచ్‌లను ఏర్పాటు చేసుకొని కోలుకున్నారు. దాంతో వారికి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించేందుకు ద్రవిడ్‌ నిరాకరించారని వార్తలొచ్చాయి. దాదా జోక్యం చేసుకున్న తర్వాత వివాదం సద్దుమణిగింది. భువనేశ్వర్‌ గాయాల తీవ్రత విషయంలోనూ ఇదే వరస. తాజాగా రోహిత్‌ ఫిట్‌నెస్‌ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. పూర్తిగా కోలుకోక ముందే అతడు ఐపీఎల్‌ ఆడటం, బాగున్నానని చెప్పడం, కోహ్లీ, బీసీసీఐపై విమర్శలు రావడం, గంగూలీ మాట్లాడిన తర్వాత రోహిత్‌ ఎన్‌సీఏకు రావడం దుమారం రేపింది. జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అయిన రోహిత్‌, కోహ్లీ మధ్య విభేదాలు, సమన్వయ లోపం ఉన్నట్టు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవన్నీ జట్టుకు నష్టం చేసేవే. వీటి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి.


సరిదిద్దుకోవాలి

2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా మరో ప్రపంచకప్‌ గెలవలేదు. ప్రతి టోర్నీకి భారీ అంచనాల నడుమ వెళ్లడం, లీగ్‌ దశలో అదరగొట్టడం, నాకౌట్ పోరులో వెనుదిరగడం పరిపాటిగా మారింది. 2022లోనైనా ఈ పరిస్థితి మారాలి. ఇందుకోసం కొన్ని కీలక మార్పులు చేసుకోవాలి. ఫైనల్‌, సెమీ ఫైనల్‌ వంటి మ్యాచుల్లో టాస్‌ గెలిచినప్పటికీ కోహ్లీ వినూత్న నిర్ణయాలు తీసుకోవడం నష్టం చేస్తోంది. ఆటగాళ్ల స్థానాలను మార్చడమూ చేటు చేస్తోంది. పిచ్‌ను పూర్తిగా అంచనా వేయకుండానే ఆడుతున్నట్టూ కనిపిస్తోంది. ఇక విదేశాల్లో చల్లని వాతావరణంలో బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు టాప్ ఆర్డర్‌ కుప్పకూలుతోంది. ఈ బలహీనతను పోగొట్టుకోవాలి. మిడిలార్డర్‌ను పటిష్ఠం చేసుకోవాలి. క్యాచులే మ్యాచుల్ని గెలిపిస్తాయన్న నానుడిని ఆటగాళ్లు మర్చిపోయారేమో అనిపిస్తోంది. తాజా ఆస్ట్రేలియా సిరీసే ఇందుకు ఉదాహరణ.  ఫీల్డింగ్‌ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు ప్రణాళికలను కట్టుదిట్టంగా అమలు చేయడం లేదని, వ్యూహా రచనలో ఇతరుల ఆలోచనలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విషయంలోనే రోహిత్‌ శర్మ విభేదిస్తున్నాడని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో ఇవన్నీ సరిదిద్దుకొని టీ20 ప్రపంచకప్‌, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని