IND vs PAK: అదరగొట్టు ఇండియా

క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే అభిమానులున్న దేశం.. భారత్‌. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం ఉన్నది.. అహ్మదాబాద్‌లో. క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే  మ్యాచ్‌.. భారత్‌ × పాకిస్థాన్‌.

Updated : 14 Oct 2023 09:29 IST

ప్రపంచకప్‌లో పాక్‌తో పోరు నేడే
మోదీ స్టేడియంలో మెగా మ్యాచ్‌
ఫేవరెట్‌ రోహిత్‌ సేన.. 8-0పై గురి
మధ్యాహ్నం2 నుంచి
అహ్మదాబాద్‌



క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే అభిమానులున్న దేశం.. భారత్‌. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం ఉన్నది.. అహ్మదాబాద్‌లో. క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే  మ్యాచ్‌.. భారత్‌ × పాకిస్థాన్‌.

మరి అత్యున్నత టోర్నీలో.. అత్యుత్తమ అభిమానుల మధ్య.. అతి పెద్ద మైదానంలో.. అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్‌ జరిగితే..?

శనివారం ఆ అద్భుతమే చూడబోతున్నాం.

క్రికెట్‌ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్‌  ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల పోరు నేడే.

చరిత్ర మనవైపే. వర్తమానంలోనూ మనదే జోరు. బలాబలాల్లోనూ పైచేయి మన జట్టుదే. అన్నింటికీ మించి ఆడుతోంది సొంతగడ్డపై. పాక్‌తో పోరులో ఫేవరెట్‌ నిస్సందేహంగా భారత జట్టే. మరి రోహిత్‌సేన అంచనాలను అందుకుంటుందా? వన్డే ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థిపై ఓటమే ఎరుగని రికార్డును కొనసాగిస్తుందా?


ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ తలపడబోయేది శనివారమే. దాదాపు లక్షా ముప్ఫైవేల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా మారిన నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగబోతోంది. అంత పెద్ద స్టేడియం నిండుగా అభిమానులతో   కళకళలాడుతుండగా.. భారత్‌-పాక్‌ తలపడుతుంటే చూడటం ఓ అద్భుత అనుభవం అనడంలో సందేహం లేదు. వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డ ఏడుసార్లూ పాకిస్థాన్‌ను ఓడించిన అజేయ రికార్డు భారత్‌ సొంతం. ఇటీవలే ఆసియా కప్‌లో పాక్‌ను చిత్తు చేసింది రోహిత్‌ సేన. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మనదే విజయం. కాబట్టి అందరూ భారత్‌ను ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. అయితే పాక్‌ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లున్నారు. టోర్నీలో ఆ జట్టు కూడా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ముఖ్యంగా శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఊపులో బాబర్‌ సేన ఈ మ్యాచ్‌లో అడుగు పెడుతోంది. కాబట్టి దాయాదిని తక్కువగా తీసుకునేందుకు అవకాశం లేదు.

గిల్‌ ఆడుతున్నట్లేనా?

పాక్‌తో కీలక పోరు ముంగిట భారత జట్టుకు ఉత్సాహాన్నిచ్చే విషయం.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డెంగీ జ్వరం నుంచి కోలుకోవడం. చెన్నైలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే జట్టు కంటే ముందే అహ్మదాబాద్‌ చేరుకున్న శుభమన్‌.. రెండు రోజులుగా బ్యాటింగ్‌ సాధన కూడా చేస్తున్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు అతను పిచ్‌ను పరిశీలిస్తూ కనిపించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా శుభ్‌మన్‌ పాక్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు 99 శాతం ఉన్నట్లు చెప్పాడు. కాబట్టి శనివారం శుభ్‌మన్‌ను మైదానంలో చూడబోతున్నట్లే. ఫామ్‌లో ఉన్న అతను.. అందుబాటులోకి వస్తే బ్యాటింగ్‌ మరింత బలోపేతమవుతుంది.

పిచ్‌ స్పిన్నర్లదే..

నరేంద్ర మోదీ స్టేడియంగా మారిన మొతెరా మైదానంలో పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. పునర్నిర్మాణం తర్వాత మరింతగా స్పిన్నర్లు ప్రభావం చూపుతున్నారు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించారు. అయితే చెన్నైలో మాదిరి పరిస్థితులు బ్యాటింగ్‌కు మరీ కష్టంగా ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు కొంతమేర వర్షం ముప్పుంది.

ఈసారి హీరో ఎవరో?

పాక్‌తో మ్యాచ్‌ను భారత అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో చెప్పాల్సిన పని లేదు. ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపిస్తే ఆ ఆటగాడు జాతీయ హీరో అయిపోతాడు. పాక్‌పై 1992, 2003, 2011లో సచిన్‌ ఇన్నింగ్స్‌లను.. పాక్‌పై 1996, 1999లో వెంకటేశ్‌ ప్రసాద్‌ అద్భుత బౌలింగ్‌ను.. 2015లో కోహ్లి సెంచరీని.. 2019లో రోహిత్‌ భారీ శతకాన్ని అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలా ఇప్పుడు హీరో ఎవరవుతారన్నది ఆసక్తికరం. బ్యాటింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి, రోహిత్‌, రాహుల్‌లపై భారీ అంచనాలున్నాయి. బౌలింగ్‌లో కుల్‌దీప్‌, బుమ్రాలపై జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మరి వీరిలో శనివారం హీరోగా నిలిచేదెవరో?


జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిన అవసరం వస్తే చేస్తాం. పిచ్‌ను బట్టి అవసరమనిపిస్తే ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం. గత రెండు మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధమయ్యామో ఈ పోరుకూ అలాగే సిద్ధమయ్యాం.  

రోహిత్‌ శర్మ


తుది జట్లు (అంచనా)...

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌/ఇషాన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌/షమి, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌.
పాకిస్థాన్‌: షఫీక్‌, ఇమాముల్‌, బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, సాద్‌ షకీల్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌, నవాజ్‌, షహీన్‌, రవూఫ్‌, హసన్‌ అలీ.

వీళ్లతోనే ముప్పు..

బలాబలాల్లో భారత్‌తో పోలిస్తే తక్కువగా అనిపిస్తున్నప్పటికీ.. పాకిస్థాన్‌ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లున్నారు. బౌలింగ్‌లో షహీన్‌ అఫ్రిది నుంచి భారత్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. ఆరంభ ఓవర్లలో అతణ్ని కాచుకోవడం సవాలే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన హారిస్‌ రవూఫ్‌తోనూ ప్రమాదమే. బ్యాటింగ్‌లో ఆ జట్టుకు రిజ్వాన్‌ అత్యంత కీలకం. శ్రీలంకపై అజేయ సెంచరీతో అతను జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్‌ కూడా మేటి ఇన్నింగ్స్‌ ఆడాడు. బాబర్‌ అజామ్‌కు భారత్‌ మీద రికార్డు బాగా లేదు. ఇటీవల అతడి ఫామ్‌ కూడా బాగా లేదు. కానీ వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ అయిన బాబర్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కాబట్టి షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌లతో జాగ్రత్తగా ఉండాలి.

ఒత్తిడిని జయిస్తే..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే ఈ మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానులు ఒక యుద్ధంలా చూస్తారు. ప్రపంచకప్‌ గెలవడం సంగతి తర్వాత, ముందు ఈ మ్యాచ్‌ నెగ్గాలి అనుకుంటారు. పాకిస్థాన్‌కు అయితే ప్రపంచకప్‌ విజయం కంటే భారత్‌పై గెలుపు ఇంకా ప్రతిష్ఠాత్మకంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాలుగా ఈ మెగా టోర్నీలో ఓటమి పాలవుతున్న జట్టు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారీ ఒత్తిడిని తట్టుకోలేకే ఆ జట్టు దెబ్బ తింటుంటుంది. ఈసారి భారత్‌ను దాని సొంతగడ్డపై ఎదుర్కోవడం మరింతగా ఒత్తిడి పెంచేదే. దీన్ని భారత్‌ సొమ్ము చేసుకోవడం కీలకం. అన్ని విభాగాల్లో పాక్‌ కంటే మెరుగ్గా కనిపిస్తున్న టీమ్‌ఇండియా.. ఆత్మవిశ్వాసంతో ఆడితే, స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే చాలు.

  • 10 పాకిస్థాన్‌పై ఆడిన 5 వన్డేల్లో కుల్‌దీప్‌ వికెట్లు. సగటు 13.5 కాగా, ఉత్తమ ప్రదర్శన 5/25.
  • భారత గడ్డపై భారత్‌తో పాక్‌ రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడింది. 1996లో బెంగళూరులో జరిగిన క్వార్టర్స్‌లో 39 పరుగుల తేడాతో, 2011లో మొహాలిలో సెమీస్‌లో 29 పరుగుల తేడాతో ఓడింది.
  • ప్రస్తుత జట్టులో పాకిస్థాన్‌పై అత్యధిక వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడింది కోహ్లీనే. 3 మ్యాచ్‌ల్లో అతను 64.3 సగటుతో 193 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం (2015లో 107), ఓ అర్ధశతకం (2019లో 77) ఉన్నాయి.
  • 77.3: పాక్‌పై ఆడిన రెండు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో రోహిత్‌ సగటు. 2019లో అతను 140 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని