Tokyo Olympics: పంజాబ్‌ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలకు ఒలింపిక్స్‌ విజేతల పేర్లు

టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు ఆటగాళ్లకు ఇప్పటికే భారీ నగదు నజరానాలతో ప్రోత్సహించిన సంగతి తెలిసిందే...

Published : 23 Aug 2021 13:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు ఆటగాళ్లకు ఇప్పటికే భారీ నగదు నజరానాలతో ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి వారిని ప్రత్యేకంగా గౌరవించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో పంజాబ్‌ నుంచే అత్యధిక మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పది ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక ఆటగాళ్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అంగీకారం తెలిపినట్లు పంజాబ్‌ విద్యాశాఖా మంత్రి విజయ్‌ ఇందర్‌ సింగ్లా పేర్కొన్నారు.

మిథాపూర్‌ జలంధర్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌, మిథాపూర్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లోని తిమ్మోవల్‌ పాఠశాల పేరును వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్‌ శంషర్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్‌ రూపిందర్‌పాల్‌ సింగ్‌ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. ఖుస్రోర్‌పూర్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ హార్దిక్‌ సింగ్‌ పాఠశాల అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్‌ కలాన్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ సిమ్‌రంజిత్‌ సింగ్‌ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి వివరించారు. కాగా, ఒలింపిక్స్‌ క్రీడల్లో ఘన చరిత్ర కలిగిన భారత పురుషుల హాకీ జట్టు గత 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో టోక్యోలో చెలరేగిన ఈ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌లో జర్మనీని ఓడించి కాంస్య పతకంతో మెరిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని