Virat Kohli: ఇంగ్లాండ్‌ పేసర్లకున్న ఓపిక విరాట్‌కు లేదు.. అందుకే ఇలా..!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కాస్త ఓపిక పట్టాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు అతడి వికెట్‌ కోసం చూపిస్తున్న సహనాన్నీ అతడు ప్రదర్శించడం లేదని పేర్కొన్నాడు..

Published : 01 Sep 2021 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కాస్త ఓపిక పట్టాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు అతడి వికెట్‌ కోసం చూపిస్తున్న సహనాన్నీ అతడు ప్రదర్శించడం లేదని పేర్కొన్నాడు. వదిలేయాల్సిన బంతులను ఆడుతూ వికెట్‌ ఇచ్చేస్తున్నాడని వెల్లడించాడు.

‘నేను చెప్పేదొకటే. ఇంగ్లాండ్‌ పేసర్లు విరాట్‌ కోహ్లీ వికెట్‌ కోసం ఎంతో ఓపిక పడుతున్నారు. కానీ, అతడు మాత్రం వారు చూపింనంత సహనమూ ప్రదర్శించడం లేదు. అదే ప్రధాన తేడా’ అని సంజయ్‌ బంగర్‌ అన్నాడు.

విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయని బంగర్‌ తెలిపాడు. ‘బంతిని డిఫెండ్‌ చేస్తున్నప్పుడు కోహ్లీ ఎక్కువగా ఔటవ్వడం లేదు. బయటకు వెళ్తున్న బంతిని వెంటాడినప్పుడే వికెట్‌ ఇస్తున్నాడు. 2014 నుంచి అతడు ఔటైన విధానం గమనిస్తే.. డ్రైవ్స్‌ చేస్తున్నప్పుడు తక్కువగానే ఔటవుతున్నాడు. అతడు ఎక్కువగా ఆరు, ఏడో స్టంప్‌ లైన్‌ బంతులు ఆడుతున్నాడు. నిజానికి అవి ఆడాల్సిన అవసరమే లేదు. బౌలర్‌ బంతి వదిలినప్పుడు అతడు తన పొజిషన్‌ చూసుకోవాలి’ అని ఆయన సూచించాడు.

కొన్నాళ్లుగా విరాట్‌ కోహ్లీ భారీ స్కోర్లు చేయడం లేదు. అడపా దడపా అర్ధశతకాలు చేసినా శతకాలు మాత్రం దక్కలేదు. ఇంగ్లాండ్‌ పర్యటనలో మూడు టెస్టుల్లో 24.80 సగటుతో 124 పరుగులే చేశాడు. జేమ్స్‌ అండర్సన్‌, ఒలీ రాబిన్సన్‌ బంతులకు ఔటవుతున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి మరీ స్లిప్‌ లేదా కీపర్‌కు చిక్కుతున్నాడు. అందుకే అతడికి సహనం అవసరమని సునిల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, నాసర్‌ హుస్సేన్‌ సహా సీనియర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని