Team India: కోహ్లీసేన సాధన.. సంరంభం.. మొదలు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమ్‌ఇండియా సాధన మొదలుపెట్టింది. సౌథాంప్టన్ మైదానంలో గురువారం ఉదయం ఒక బృందంగా ఏర్పడి సాధన చేసింది. నెట్‌ సెషన్స్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు. సాధన, కసరత్తులు చేసేటప్పుడు ఉత్సాహంగా కనిపించారు. ...

Published : 10 Jun 2021 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమ్‌ఇండియా సాధన మొదలుపెట్టింది. సౌథాంప్టన్ మైదానంలో గురువారం ఉదయం ఒక బృందంగా ఏర్పడి సాధన చేసింది. నెట్‌ సెషన్స్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు. సాధన, కసరత్తులు చేసేటప్పుడు ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ‘మా తొలి బృంద సాధన సెషన్‌ను ముగించాం. అందరిలోనూ ఉత్సాహం ఎక్కువగానే ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమ్ఇండియా సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి’ అని వ్యాఖ్య జత చేసింది.

ముంబయిలో పది రోజులకు పైగా క్వారంటైన్‌లో ఉన్న టీమ్‌ఇండియా జూన్‌ 3న సౌథాంప్టన్‌ చేరుకుంది. అక్కడ వరుసగా మూడు రోజులు కఠిన క్వారంటైన్‌లో గడిపింది. ఆంక్షల సడలింపు మొదలవ్వడంతో క్రికెటర్లంతా మైదానంలోకి అడుగుపెట్టారు. పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ సాధన చేశారు. మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ చేశారు. మిగతా ఆటగాళ్లు కసరత్తులు చేస్తూ గడిపారు. రిషభ్ పంత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

జూన్‌ 18న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. క్వారంటైన్‌ నియమాల వల్ల భారత్‌కు సన్నాహక మ్యాచులు ఆడేందుకు వీలవ్వలేదు. దాంతో ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. వీలైనన్ని సెషన్లు సాధన చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు న్యూజిలాండ్‌ గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తలపడుతోంది. ముందుగానే వారు అక్కడికి చేరుకోవడంతో మ్యాచ్‌ ప్రాక్టీస్ లభిస్తోంది. ఇది వారికి ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని