Virat Kohli: భారమైన హృదయంతో బయల్దేరుతున్నాం.. కోహ్లీ భావోద్వేగ ట్వీట్

టీ20 ప్రపంచకప్ మెగా సమరంలో టీమ్‌ఇండియా నిష్క్రమణపై స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఉద్వేగానికి గురయ్యాడు. నిరాశతో నిండిన హృదయాలతో ఆస్ట్రేలియాను వీడుతున్నామంటూ ట్వీట్ చేశాడు.

Updated : 11 Nov 2022 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా టైటిల్‌ కల తీరకుండానే మరో పెద్ద టోర్నీలో టీమ్‌ఇండియా ప్రయాణం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ నుంచి రోహిత్‌ సేన అవమానభారంతో నిష్క్రమించింది. ఈ ఓటమి జట్టు ఆటగాళ్లను దుఃఖంలో ముంచెత్తింది. కోట్లాది మంది భారత అభిమానులను నిరాశలోకి నెట్టేసింది. ఈ అసంపూర్ణ ప్రయాణంపై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భారమైన హృదయంతో ఆస్ట్రేలియాను వీడుతున్నామంటూ ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. ఈ టోర్నీ నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘మా కలను సాధించకుండా.. తీవ్ర నిరాశతో నిండిన హృదయాలతో ఆస్ట్రేలియా తీరాలను వదిలివెళ్తున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలనేదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నా’’ - ట్విటర్‌లో కోహ్లీ

ఇక, యువ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘బాధాకరమైన ఓటమి. మేం ఎక్కడ ఆడినా అద్వితీయ మద్దతు ఇచ్చే మా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ.. ఎంతో కష్టపడిన జట్టు యాజమాన్యం, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు. నా దేశానికి ఆడటం గర్వంగా ఉంది. మరింత బలంగా తిరిగొస్తాం’’ అని సూర్య ట్విటర్‌లో రాసుకొచ్చాడు. అటు టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గుండె బద్దలైన ఎమోజీని ట్వీట్ చేసి నిరాశ వ్యక్తం చేశాడు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు