Cricket News: ఏడో ర్యాంక్‌కు విరాట్.. మైకెల్ వాన్‌కు భజ్జీ కౌంటర్!

Published : 12 Oct 2023 12:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI WC 2023) ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. భారత్‌ (Team India) వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ సరిగా లేదనే మైకెల్ వాన్‌ వ్యాఖ్యలకు హర్భజన్‌ సింగ్‌ కౌంటర్ ఇచ్చాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకం ప్రకటించడంపై అఫ్గాన్‌ ఆటగాడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

రెండు ర్యాంకులు మెరుగుపర్చుకుని..

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై కీలకమైన 85 పరుగులు చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం 715 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్‌ గిల్ (830పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. బాబర్ అజామ్ (835) టాప్‌ ర్యాంకర్‌. ఇక ఆసీస్‌పై డకౌట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానానికి పడిపోయాడు. అయితే, అఫ్గాన్‌పై తాజాగా చేసిన సెంచరీని ఐసీసీ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే కోహ్లీ కూడా అఫ్గాన్‌పై అర్ధశతకం చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వీరికి మరింత మెరుగైన స్థానాలు దక్కడం ఖాయం.


మ్యాచ్‌ను చూస్తున్నావా..? ఖాళీ కుర్చీలనా..?

టీమ్‌ఇండియా క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ ఎప్పుడూ వ్యగ్య ధోరణిలో ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా భారత్-అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) మ్యాచ్‌ జరిగిన దిల్లీ స్టేడియంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశాడు. అయితే, దానికి భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. ‘‘భారత్‌ మ్యాచ్‌కూ చాలా సీట్లు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?’ అని వాన్‌ ట్వీట్ చేశాడు. దానికి హర్భజన్‌ ‘‘నువ్వు మ్యాచ్‌ చూస్తున్నావా..? ఖాళీ సీట్లనా?’’ అని సమాధానం ఇచ్చాడు. 


స్వర్ణం పంచితే బాగుండేది: అఫ్గాన్‌ పేసర్ ఫరీద్ మాలిక్

ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా.. అఫ్గానిస్థాన్‌ రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైంది. దాంతో టాప్‌ సీడ్‌గా ఉన్న టీమ్‌ఇండియాకు  గోల్డ్‌ దక్కింది. అయితే, ఇలా ఇవ్వడం సరైంది కాదని అఫ్గాన్‌ పేసర్ ఫరీద్ మాలిక్‌ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఫరీద్ వరల్డ్‌ కప్‌ కోసం అఫ్గాన్‌ రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్నాడు. ‘‘స్వర్ణ పతకాన్ని ఇరు జట్లకూ పంచి ఇస్తే బాగుండేది. ర్యాంకింగ్స్ ప్రకారం ఇవ్వడం సరైంది కాదు. మ్యాచ్‌ జరిగి ఉంటే ఫుల్‌ మజా ఉండేది. చైనా, మలేషియా వంటి ఇతర దేశాలకూ క్రికెట్‌ విస్తరించడం ఆనందంగా ఉంది. అయితే, మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన చైనా ప్రేక్షకులకు నిబంధనలు కూడా తెలియవు. ప్రతి విషయానికి చప్పట్లు కొట్టారు. ఔటైనా.. సిక్స్‌ కొట్టినా అదే స్పందన’’ అని ఫరీద్ అసహనం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని