T20 League : వరుసగా మూడేసి ఓటములు... టాప్‌ 2 టీమ్స్‌కి ఏమైంది?

రెండు కొత్త జట్లతో కలిపి మొత్తం పది టీమ్‌లు టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో..

Updated : 07 Apr 2022 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకటేమో ఐదు సార్లు ఛాంపియన్‌.. మరొకటేమో నాలుగుసార్లు టీ20 లీగ్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జట్టు. అలాంటి టీమ్స్‌ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినా బోణీ కొట్టలేక అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా ఆ జట్లేవో.. ముంబయి, చెన్నై. ఇన్నేళ్లుగా టాప్‌ - 2 జట్లుగా చలామణి అవుతున్న రోహిత్‌ సేన, జడేజా/ధోనీ సేన పరిస్థితి ఎందుకిలా మారింది. కారణాలేంటో చూద్దాం!

రెండు కొత్త జట్లతో కలిపి మొత్తం పది టీమ్‌లు టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో తలపడుతున్నాయి. మెగా వేలం జరగడంతో పాత జట్లన్నీ మారిపోయాయి. కొత్త ఆటగాళ్ల చేరికతో కొన్ని జట్లు అనుకున్నదానికన్నా రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్నాయి.  అయితే ముంబయి, చెన్నై జట్లు మాత్రం ఢీలాపడ్డాయి. స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని విభాగాల్లో బలహీనంగా ఉండటం కూడానూ  విజయాలను అందుకోకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముంబయి జట్టులో బౌలర్ల కొరత కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌ విభాగం బలహీనంగా ఉందనిపిస్తోంది. 

యువ బ్యాటర్లు ఓకే.. 

ముంబయి, పుణె వేదికగా జరుగుతున్న మ్యాచుల్లో పిచ్‌ల నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు. అయినా సరే సరిగ్గా ఆడితే పరుగులు రాబట్టొచ్చని బ్యాటర్లు నిరూపిస్తున్నారు. ఉదాహరణకు ముంబయి యంగ్‌ బ్యాటర్ తిలక్‌ వర్మనే తీసుకుంటే మిడిలార్డర్‌లో వచ్చి మరీ (61, 22, 38) పరుగులు సాధించాడు. గతంలో హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్య ఇదే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ఇప్పుడు వారిద్దరూ వేర్వేరు జట్లకు వెళ్లిపోవడం ముంబయికి లోటే.  అంతేకాకుండా భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (81, 54) రెండు అర్ధ శతకాలు సాధించాడు. ఇషాన్‌కు తోడుగా మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆడితేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుంది. ఇక సూర్యకుమార్‌ కూడా ఈ సీజన్‌ మొదటి మ్యాచ్‌లోనే (52) హాఫ్‌ సెంచరీ నమోదు చేసి ఆకట్టుకున్నాడు. అయితే కీలక సమయంలో రోహిత్ శర్మ, పొలార్డ్‌ వంటి సీనియర్లు బాధ్యత తీసుకోవాలి. పొలార్డ్‌ కోల్‌కతా మీద (5 బంతుల్లో 22) భారీ హిట్టింగ్‌ చేశాడు. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (24 బంతుల్లో 22) నిదానంగా ఆడటంతో ముంబయి ఓటమిని చవిచూసింది. ఇలాంటి సమయంలో ధాటిగా ఆడితే జట్టులోని ఇతర సభ్యులకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది. 

బౌలర్లు మరీ దారుణం..

ఒకప్పుడు ముంబయి బౌలింగ్‌ అంటే ప్రత్యర్థి జట్లకు దడగా ఉండేది. ప్రారంభ ఓవర్లలో బౌల్ట్‌ కంట్రోల్‌ చేస్తే.. మిడిల్‌ ఓవర్లలో బుమ్రా అదరగొట్టేవాడు. పొలార్డ్‌ కీలక సమయంలో స్లో బౌలింగ్‌లో వికెట్లను తీసేవాడు. అయితే ఇప్పుడు బుమ్రా ఒక్కడి మీదే భారమంతా పడుతోంది. యువ బౌలర్లు బసిల్‌ థంపి, మురుగన్‌ అశ్విన్‌ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. మిల్స్‌ అప్పుడప్పుడు రాణిస్తున్నా.. పొలార్డ్‌, డానియల్‌ సామ్స్‌ విఫలమవుతున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ ధాటికి డానియల్ సామ్స్ ఏకంగా ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ను పోగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మార్చుకోకపోతే రాబోయే మ్యాచ్‌ల్లోనూ విజయం పలకరించడం కష్టమే అవుతుంది. 


గత ఛాంపియన్‌ ఓటమితో ఆరంభం.. 

చెన్నై గురించి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. గత సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రుతురాజ్‌ గైక్వాడ్ ఈసారి తన మార్క్‌ ఆటను చూపించడం లేదు. చెన్నైను ఓపెనింగ్‌ సమస్యా వెంటాడుతోంది. రుతురాజ్‌కు తోడుగా డుప్లెసిస్‌ చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజ్‌లో నిలబడేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు డుప్లెసిస్‌ బెంగళూరు సారథిగా వెళ్లిపోయాడు. ఆ జట్టు విజయాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. రుతురాజ్‌ ఆడకపోవడంతోపాటు రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా పంపిన కాన్వే ఘోరంగా విఫలమయ్యాడు. మూడో మ్యాచ్‌లో ఉతప్పను పంపితే సూపర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కొత్త సారథి రవీంద్ర జడేజా కూడా ఇటు బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. సారథ్య బాధ్యతలను వదిలేసిన ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌లో రాణించడం విశేషం. అయితే ధోనీనే మైదానంలోనూ నిర్ణయాలు తీసుకోవడం వల్లే జడేజా ఒత్తిడికి గురవుతూ రాణించలేకపోతున్నాడనే విమర్శలూ లేకపోలేదు. 

నిరాశపరిచే బౌలింగ్ దాడి 

గత సీజన్‌ వరకు చెన్నై బౌలింగ్‌కు ఆయువుపట్టులా దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ ఉండేవారు. బ్రావో ఎలానూ మిడిల్‌, డెత్‌ ఓవర్లలో అండగా నిలిచేవాడు. అయితే ఈసారి శార్దూల్‌ లేడు.. దీపక్‌ చాహర్ ఇంకా తుది జట్టులోకి రాలేదు. దీంతో కుర్రాళ్లు తుషార్‌ దేశ్‌పాండే, శివమ్‌ దూబే, ముకేశ్‌ చౌదరితోపాటు విదేశీ ఆటగాళ్లు ప్రిటోరియస్‌, మిల్నేతో బౌలింగ్‌ చేయించారు. జడేజా, మొయిన్‌ అలీ, బ్రావో తమదైన స్థాయి బౌలింగ్‌ చేయలేకపోయారు. బ్రావో, ప్రిటోరియస్‌ ఫర్వాలేదనిపించినా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయారు. 210 పరుగుల భారీ స్కోరు చేసినా లఖ్‌నవూ ఆటగాళ్లను కట్టడి చేయడంలో విఫలమై ఓటమిపాలయ్యారంటే బౌలింగ్‌ దాడి ఎంత వీక్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఓవర్‌ వేసిన శివమ్‌ దూబే (0/25) దెబ్బకు గెలవాల్సిన మ్యాచ్‌ను చెన్నై చేజార్చుకుంది. పిచ్‌లు స్పిన్‌కు సహకరించకపోవడం కూడానూ జడేజా, మొయిన్‌కు ఎదురుదెబ్బ. మూడింట్లో ఒక మ్యాచ్‌ ఆడిన క్రిస్‌ జొర్డాన్‌ ( పంజాబ్‌ మీద 2/23) మాత్రమే కాస్త రాణించాడు. 

టాస్‌ కంటే జట్టు కూర్పే కీలకం

మ్యాచ్‌ విజయంలో టాస్‌ కీలకమవుతుందో లేదో కానీ జట్టు కూర్పు మాత్రం చాలా ముఖ్యం. టాస్‌ ఓడి భారీ స్కోరు చేసినా లక్ష్యాలను కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే బౌలింగ్‌ సరిగా లేకపోతే ఓటమి చవిచూడాల్సి వచ్చిందనేది చెన్నై, ముంబయి జట్లు ఇప్పటికే తెలుసుకొని ఉంటాయి.. అంతేకాకుండా బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరీ ముఖ్యంగా చెన్నై ఈ సమస్య ఎక్కువగా ఉంది. మూడు మ్యాచుల్లోనూ విఫలమైన రుతురాజ్‌ ఫామ్‌ను  అందుకోవాలి. టాప్‌ఆర్డర్ బలోపేతంగా ఉంటే మిడిలార్డర్‌ బ్యాటర్లు స్వేచ్ఛగా హిట్టింగ్‌ చేయగలరు. అదేవిధంగా పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లను తీస్తేనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగే అవకాశం ఉంది. వీటన్నింటి కంటే మైదానంలో ఫీల్డింగ్‌ చాలా కీలకం. చెన్నై ఓటమికి క్యాచ్‌లు విడిచిపెట్టడమూ కారణమని ఆ జట్టు సారథి రవీంద్ర జడేజా ఇప్పటికే చెప్పాడు. కాబట్టి అన్ని విభాగాలపై దృష్టిసారించి ఇక నుంచైనా విజయాలను నమోదు చేయాలని చెన్నై, ముంబయి అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై (8వ స్థానం), ముంబయి (9వ స్థానం) కింద.. ఆఖర్లో హైదరాబాద్‌ (10) ఉంది. కాకపోతే హైదరాబాద్‌ ఇప్పటికి రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని