IND vs ENG: సచిన్‌, గంగూలీ సరసన యశస్వి, శుభ్‌మన్‌ గిల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (Shubman Gill), యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సెంచరీలు బాది అరుదైన క్లబ్‌లో చేరారు.

Published : 04 Feb 2024 22:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (Shubman Gill), యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి (209) డబుల్‌ సెంచరీ బాదగా.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ (104) శతక్కొట్టాడు. దీంతో వీరిద్దరూ అరుదైన క్లబ్‌లో చేరారు. భారత్‌ తరఫున 25 ఏళ్లలోపు వయసులో ఒకే టెస్టు మ్యాచ్‌లో శతకాలు సాధించిన రెండో జోడీగా రికార్డు సృష్టించారు. అంతకుముందు సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar), సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) కూడా ఇంగ్లిష్‌ జట్టుపైనే ఈ ఘనత సాధించారు. 1996లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్‌, గంగూలీ ద్వయం ఈ ఫీట్ అందుకుంది. ఆ మ్యాచ్‌ నాటికి 23 ఏళ్ల వయసున్న సచిన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేశాడు. అప్పటికి 24 ఏళ్లు ఉన్న గంగూలీ ఆ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 136 రన్స్‌ సాధించాడు.

టెస్టుల్లో యశస్వికి ఇదే తొలి డబుల్‌ సెంచరీ. ఈ క్రమంలోనే టెస్టుల్లో ద్విశతకం చేసిన నాలుగో భారత లెఫ్ట్‌హ్యాండర్‌గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. వినోద్‌ కాంబ్లి, గంగూలీ, గంభీర్‌ అతని కంటే ముందున్నారు. చిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్‌గానూ  యశస్వి నిలిచాడు. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొన్న శుభ్‌మన్‌ గిల్ ఎట్టకేలకు శతకంతో కౌంటర్‌ ఇచ్చాడు. 12 ఇన్నింగ్స్‌ల తర్వాత అతడు మూడంకెల స్కోరు నమోదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని