iPhone: ఇకపై బ్యాటరీ మార్చాలంటే.. ధరల మోతే!

ఐఫోన్ 14 మినహా అన్ని పాత ఐఫోన్‌ మోడల్స్‌లో బ్యాటరీ మార్చేందుకు అయ్యే ధరను యాపిల్‌ పెంచనుంది. 2023 మార్చి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. 

Published : 03 Jan 2023 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత ఐఫోన్‌ యూజర్లకు యాపిల్ కంపెనీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఇక నుంచి కంపెనీ వారెంటీలో లేని పాత ఐఫోన్‌ మోడల్స్‌లో బ్యాటరీ మార్చేందుకు అయ్యే ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. గతేడాది విడుదలైన ఐఫోన్ 14 సిరీస్‌ మినహా అన్ని పాత ఫోన్‌ మోడల్స్‌కు ఈ ధరలు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఐఫోన్‌లో బ్యాటరీ మార్చేందుకు అమెరికాలో 69 డాలర్లు, భారత్‌లో సుమారు ₹ 5 వేల నుంచి ₹ 7 వేల వరకు ఖర్చవుతోంది. తాజాగా ఈ ధరను మరో ₹ 20 డాలర్లు పెంచనుంది. 2023 మార్చి 1 నుంచి  ఈ ధరలు అమల్లోకి రానున్నట్టు సమాచారం.  

యాపిల్ కేర్‌, యాపిల్ కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వినియోగదారులకు మాత్రం ఎలాంటి అదనపు రుసుము లేకుండా బ్యాటరీ మారుస్తారు. ఒకవేళ యాపిల్‌ కేర్ సబ్‌స్క్రిప్షన్‌ ఉండి.. బ్యాటరీ సామర్థ్యం 80 శాతం కంటే తక్కువ ఉన్నవారు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కొత్త ఐఫోన్ కొనుగోలు చేసిన వారికి ఒక ఏడాది హార్డ్‌వేర్‌ రిపేర్‌ కవరేజ్‌తోపాటు, 90 రోజుల టెక్నికల్‌ సపోర్ట్‌ను యాపిల్ అందిస్తోంది. అదే, యాపిల్‌ కేర్‌+ సబ్‌స్క్రైబర్లకైతే రెండేళ్ల పాటు వారెంటీతోపాటు, యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఛార్జీలను ఐఫోన్‌తోపాటు మ్యాక్‌, ఐపాడ్‌లకు పెంచనుంది. మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ బ్యాటరీకి 30 డాలర్లు, మ్యాక్‌బుక్‌ ప్రో బ్యాటరీకి 50 డాలర్లు, ఐపాడ్‌ మోడల్స్‌కు 20 డాలర్లు పెంచనుంది. ఈ పెంపు పాత ఐఫోన్‌ యూజర్లపై అదనపు భారాన్ని మోపుతుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని