చెట్లకు పీడల గండం

మనకు మాదిరిగానే చెట్లకూ జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇవి వాటికి హాని చేస్తాయి. ఆరోగ్యాన్ని, ఆకారాన్ని దెబ్బతీస్తాయి. పరిస్థితి తీవ్రమైతే చెట్లు చనిపోవచ్చు కూడా. ఇటీవల మనదేశంలో వేప చెట్లకు ఇలాంటి దుస్థితి తలెత్తటం తెలిసిందే.

Published : 18 Oct 2023 00:03 IST

మనకు మాదిరిగానే చెట్లకూ జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇవి వాటికి హాని చేస్తాయి. ఆరోగ్యాన్ని, ఆకారాన్ని దెబ్బతీస్తాయి. పరిస్థితి తీవ్రమైతే చెట్లు చనిపోవచ్చు కూడా. ఇటీవల మనదేశంలో వేప చెట్లకు ఇలాంటి దుస్థితి తలెత్తటం తెలిసిందే. పర్యావరణ మార్పు, అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువవటం వల్ల కొత్త జబ్బుల ముప్పూ పెరుగుతూ వస్తోందని తాజా అధ్యయనం పేర్కొంటోంది.

ఫంగస్‌, బ్యాక్టీరియా, వైరస్‌లే కాదు పర్యావరణ ఒత్తిళ్లూ వృక్షాలకు జబ్బులను తెచ్చిపెడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ధోరణి ఎక్కువవుతోందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఇప్పటికే కొన్ని చెట్లను కోల్పోయామని, కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నకొద్దీ ఇతర చెట్లకూ ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటోందని హెచ్చరిస్తోంది. అమెరికా పర్యావరణవేత్తలు వివిధ దేశాల్లో చెట్లను పీడిస్తున్న 900 కొత్త జబ్బుల మీద అధ్యయనం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని గుర్తించారు. వాతావరణ మార్పు కరవు, కాటకాలకు దారితీస్తుంది. ఇవి చెట్ల మీద తీవ్రమైన ఒత్తిడిని కలగజేస్తాయి. ఫలితంగా హానికారక క్రిములు త్వరగా దాడిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వేడి వాతావరణంలో హానికారక క్రిములు ఎక్కువకాలం జీవిస్తాయి. తేమ కూడా తోడైతే మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీంతో చీడ పీడలు మరింత ఉద్ధృతంగా మారతాయి. తరచుగానూ దాడి చేస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సైతం మరిన్ని జబ్బులను మోసుకొస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. కొత్త జబ్బులు చెట్ల మీద పూర్తిగా ప్రభావం చూపేంతవరకూ వాటిని గుర్తించలేమని, ఫలితంగా చికిత్స కూడా కష్టమవుతోందని చెబుతున్నారు. ఆకుల రంగు మారటం, ఎండిపోవటం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలని, తగు చికిత్స పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. చెట్లకు తగినన్ని పోషకాలు అందేలా చూడటంతో పాటు రసాయన చికిత్సలు, దెబ్బతిన్న చెట్ల భాగాలను తొలగించటం వంటి పద్ధతులు వృక్ష సంరక్షణకు మేలు చేస్తాయని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని