నకిలీ వీడియోల హల్‌చల్‌

ఇటీవల సినీ హీరోయిన్లు రష్మిక మందాన, కత్రినా కైఫ్‌ల నకిలీ వీడియోలు కలకలం రేపాయి. డీప్‌ఫేక్‌ పరిజ్ఞానంతో సృష్టించిన ఇవి కొత్త చర్చకు దారితీశాయి

Updated : 15 Nov 2023 06:57 IST

ఇటీవల సినీ హీరోయిన్లు రష్మిక మందాన, కత్రినా కైఫ్‌ల నకిలీ వీడియోలు కలకలం రేపాయి. డీప్‌ఫేక్‌ పరిజ్ఞానంతో సృష్టించిన ఇవి కొత్త చర్చకు దారితీశాయి. ఎక్కడా నకిలీవనే అనుమానం కలగని విధంగా పుట్టించిన ఈ వీడియోలు కృత్రిమ మేధ (ఏఐ) వ్యక్తిగత జీవితంలోకి ఎంతగా చొచ్చుకొచ్చే అవకాశముందో, తప్పుడు సమాచారం ఎంత వేగంగా విస్తరించే ప్రమాదముందో కళ్లకు కట్టాయి. డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్‌ను గుర్తించే సమర్థ సాధనాల ఆవశ్యకతను ఎత్తి చూపాయి. ఇంతకీ వీటిని పసిగట్టేదెలా?

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ మనిషిని పోలిన మనిషి వీడియో, ఫొటోలను సృష్టించటం డీప్‌ఫేక్‌ పరిజ్ఞానానికి చిటికెలో పని. ఒకేరకం పోలికలు గలవారి ముఖం స్థానంలో వేరే వ్యక్తుల ముఖాలను మార్పిడి చేసి మాయ చేయటం దీని ప్రత్యేకత. అదీ నిజమైనవని, అచ్చం అసలు వ్యక్తులకే సంబంధించినవే అనేలా భ్రమ కల్పిస్తుంది. డీప్‌ఫేక్‌ ప్రోగ్రామ్‌ అనేది ఓ న్యూరల్‌ నెట్‌వర్క్‌ పోగ్రామ్‌. దీనికి బోలెడన్ని ఫొటోలు, వీడియోలతో శిక్షణ ఇస్తారు. దీంతో అది ముఖ కవళికలను నేర్చుకుంటుంది. డీప్‌ఫేక్‌ పరిజ్ఞానం ఆయువు జెనరేటివ్‌ అడ్వర్సరియల్‌ నెట్‌వర్క్స్‌ (గాన్స్‌). ఇది రెండు ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ (ఏఎన్‌ఎన్‌) సముదాయం. ఇవి ఒకదానికి (ఫొటో, వీడియో) ఎదురుగా మరోదాన్ని నిలబెట్టి ముఖ కవళికలను నేర్చుకునేలా శిక్షణ ఇస్తాయి. ఒక దృశ్యాన్ని మరోటి బురిడీ కొట్టిస్తూ మార్పిడి చేసిన వీడియో, ఫొటోలు సృష్టిస్తాయి. శిక్షణ తీసుకుంటున్నకొద్దీ నైపుణ్యం సాధిస్తాయి. ఇంటెలిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో నిజమైన వీడియోలు, ఫొటోలే అనిపించేలా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం డీప్‌ఫేక్స్‌ ముఖాన్ని మాత్రమే మారుస్తున్నాయి. మున్ముందు మొత్తం దశ్యాన్ని.. అంటే చుట్టుపక్కల పరిసరాలు, దుస్తుల వంటి వాటిని మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ఎలా గుర్తించాలి?

డీప్‌ఫేక్‌ పరిజ్ఞానం ఎంత తెలివిగా నకిలీ వీడియో, ఫొటోలను సృష్టించినా వాటిని గుర్తించే అవకాశం లేకపోలేదు.

  • కళ్ల కదలికలు, ముఖ కవళికలు అసహజంగా: డీప్‌ఫేక్‌ వీడియోల్లో కళ్ల కదలికలు అసహజంగా ఉండొచ్చు. కొన్నిసార్లు కళ్లు అసలే కదలకపోవచ్చు. కనురెప్పలు ఆడించకపోవచ్చు. అలాగే ముఖ కవళికలూ లేకపోవచ్చు. లేదూ ఆయా భావాలు, మాటలకు అనుగుణంగా ముఖం కనిపించకపోవచ్చు.
  •  ముఖం ఎబ్బెట్టుగా: కళ్లు, కనుబొమలు, ముక్కు, నోరు, దవడ వంటివి ఎబ్బెట్టుగా.. ఉండాల్సిన చోట లేవనిపించొచ్చు. శరీర కదలికలు లేదా భంగిమ సహజంగా కనిపించవు.
  • పెదాల కదలిక, మాటలకు పొంతన లేకపోవటం: డీప్‌ఫేక్స్‌లో చాలావరకు పెదాల కదలికలకు, రోబో గొంతుకు పొంతన కుదరదు.
  • రంగు, నీడలు వేర్వేరు: డీప్‌ఫేక్‌ పరిజ్ఞానం వేర్వేరు ఫొటోలు, వీడియో క్లిప్‌లను జోడించి నకిలీ వీడియోలను సృష్టిసుంది. అందువల్ల కాంతి, నీడలు, నేపథ్యం ఒకేలా ఉండవు. తరచూ మారిపోవచ్చు. ముఖం లేదా శరీరం మీద రంగు, నీడ వంటివి తేడాగా ఉండొచ్చు.
  • నాణ్యత లోపం: కృత్రిమ మేధ సృష్టించిన వీడియోలు అంత నాణ్యంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఉచిత లేదా చవక వీడియో జనరేటర్లను వాడితే నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పిక్సెల్‌ విడిపోయినట్టు, మసక మసకగా కనిపిస్తే నకిలీ వీడియోగా అనుమానించాలి.
  •  వీడియో ఎక్కడిదనేదీ ముఖ్యమే: వీడియోను ఎవరు పోస్ట్‌ చేశారు? వారి విశ్వసనీయత ఏంటి? అనే వివరాలూ నకిలీ వీడియోలను పట్టిస్తాయి. అధీకృత, విశ్వసనీయ సంస్థలు అనుచిత దృశ్యాలకు అనుమతించవు. కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని