Samsung: శాంసంగ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022.. 10 కీలక పాయింట్లు

శాంసంగ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022 (SDC22)ను గురువారం నిర్వహించింది. ఇందులో భవిష్యత్తులో శాంసంగ్‌ తీసుకురాబోయే టెక్నాలజీతోపాటు, స్మార్ట్‌ఫోన్‌ ఓఎస్‌ వన్‌యూఐ 5 వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలివే.

Published : 15 Oct 2022 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్‌ కంపెనీ అక్టోబరు చివరినాటికి కొత్త ఓఎస్‌ వన్‌యూఐ 5ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా నిర్వహించిన శాంసంగ్ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2022 (SDC22)లో వన్‌యూఐ ఓఎస్‌తోపాటు, కొత్తగా తీసుకురాబోయే టెక్నాలజీల గురించి వివరించింది. వాటి పూర్తి వివరాలివే.

  1. శాంసంగ్ కంపెనీ మొబైల్‌ ఓఎస్‌ వన్‌యూఐలో కొత్త వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వన్‌యూఐ 5గా వస్తోన్న ఈ వెర్షన్‌ను కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్‌గా శాంసంగ్‌ పిలుస్తోంది. పర్సనలైజేషన్‌, ప్రొడక్టివిటీ, పాజిబులిటీ అనే మూడు అంశాల ఆధారంగా ఈ వెర్షన్‌ను డిజైన్‌ చేసినట్లు ఎస్‌డీసీ22లో కంపెనీ ప్రకటించింది. 
  2. ఈ ఓఎస్‌ సాయంతో యూజర్‌ తన అవసరాలకు అనుగుణంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసుకోవచ్చు. నిద్ర, డ్రైవింగ్‌, ఎక్సర్‌సైజ్‌  వంటి యాక్టివిటీలకు అనుకూలంగా ఫోన్‌ ఎలా ఉండాలనేది సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. గుడ్‌ లాక్‌ (Good Lock) అనే యాప్‌ సాయంతో యూజర్లు వీడియోను లాక్‌స్క్రీన్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకోవచ్చు. 
  3. వన్‌యూఐ 5లో బిక్స్‌బై టెక్ట్స్‌ కాల్‌ ( Bixby Text Call) మరో కీలకమైన ఫీచర్‌. దీంతో యూజర్‌ ఫోన్‌కాల్స్‌కు టెక్ట్స్‌తో కాకుండా ఆడియో మెసేజ్‌తో తన స్పందన తెలియజేయొచ్చు. ఫోన్‌కాల్స్‌ను ఆన్సర్‌ చేయలేని సందర్భాల్లో యూజర్‌  రిప్లైని టెక్ట్స్‌ మెసేజ్‌గా టైప్‌ చేస్తే, దాన్ని బిక్స్‌బై ఆడియో మెసేజ్‌గా మార్చి అవతలి వారికి పంపుతుంది. 
  4. వీటితోపాటు స్మార్ట్‌ఫోన్స్‌ కోసం డైనమిక్‌ లాక్‌ స్క్రీన్‌, మడతఫోన్ల కోసం ఫ్లెక్స్ మోడ్‌,  గెలాక్సీ వాచ్‌లకు వాచ్‌ ఫేస్‌ స్టూడియో అనే ఫీచర్లను తీసుకొస్తోంది. ఫోన్‌-టూ-పీసీ కనెక్టివిటీ, క్విక్ షేర్‌, స్మార్ట్‌ వ్యూ, ఆటో స్విచ్ బడ్స్‌, స్టాక్డ్‌ విడ్జెట్స్‌ వంటి ఫీచర్లను కూడా వన్‌యూఐ 5లో పరిచయం చేయనున్నట్లు శాంసంగ్‌ వెల్లడించింది.
  5. స్మార్ట్‌ డివైజ్‌ల సెక్యూరిటీ కోసం శాంసంగ్‌ నాక్స్‌ (Samsung Knox)ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ డివైజ్‌లలోని యూజర్‌ డేటాకు ఇదే రక్షణ వ్యవస్థ. కొత్తగా ఇందులో నాక్స్‌ మాట్రిక్స్‌ (Knox Matrix) వెర్షన్‌ను శాంసంగ్ అభివృద్ధి చేస్తోంది. బ్లాక్‌చెయిన్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ యూజర్‌ డేటాకు మరింత భద్రత కల్పిస్తుందని శాంసంగ్ తెలిపింది. 
  6. శాంసంగ్‌ స్మార్ట్‌థింగ్స్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా స్మార్ట్‌ హెమ్‌ డివైజ్‌ల కోసం బిక్స్‌బై హోమ్‌ స్టూడియో (Bixby Home Studio)ను యూజర్లకు పరిచయం చేయనుంది.  ఇది యూజర్‌ కమాండ్ ఆధారంగా పనిచేస్తుంది. ఉదాహరణకు ఏసీ ఆన్‌ చేయమని కమాండ్‌ ఇస్తే, బిక్స్‌బై హెమ్‌ స్టూడియో ఏసీ ఆన్‌ చేసే ముందు ఇంట్లో కిటికీలు తెరిచి ఉంటే, వాటిని మూసివేయమని యూజర్‌కు సూచిస్తుంది. 
  7. హెల్త్‌, హోమ్‌ ఆధారిత స్మార్ట్‌ డివైజ్‌లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో యూజర్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ డివైజ్‌లను తయారుచేసేందుకు శాంసంగ్‌, గూగుల్ కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించాయి. దీనివల్ల డివైజ్‌ తయారీదారులు, వినియోగదారులకు మేలు జరగడంతోపాటు, గూగుల్‌ హోమ్‌, నెస్ట్‌ హబ్‌లను యూజర్లు సులువుగా యాక్సెస్‌ చేయొచ్చని రెండు కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. 
  8. శాంసంగ్‌ గేమింగ్ హబ్‌ అభివృద్ధిలో భాగంగా ఎక్స్‌బాక్స్‌. ఎన్‌విడియా, ఉటోమిక్‌ వంటి కంపెనీలతో జట్టు కడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కలయికతో తమ గేమింగ్ హబ్‌ ద్వారా యూజర్‌కు సరికొత్త గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిచండంతోపాటు, గేమ్‌లో ఇమేజ్‌ క్వాలిటీ, విజువల్‌ డిస్‌ప్లే గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని శాంసంగ్‌ చెబుతోంది. 
  9. హెల్త్‌, వెల్‌నెస్‌ విభాగాల్లో శాంసంగ్‌ రోబోటిక్స్‌ ద్వారా భవిష్యత్తులో సరికొత్త హౌస్‌హోల్డ్‌ రోబ్‌ట్‌లను యూజర్లకు పరిచయం చేయనుంది. జెట్‌బోట్‌ ఏ+ వాక్యూమ్‌, బోట్‌ హ్యాండీ రోబోట్లను తీసుకొస్తుంది. ఇవి ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. ఇవి రీసెర్చ్‌, ఇంటి పనుల్లో కీలకంగా మారుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
  10. జెట్‌బోట్‌ ఏ+ వాక్యూమ్‌ను ఇల్లు, కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి చోట్ల మనుషుల ప్రమేయం లేకుండా శుభ్రపరిచేందుకు ఉపయోగించవచ్చు. ఇక బోట్‌ హ్యాండీ, హోటల్స్‌లో వంట చేయడం, ఇంట్లో వస్తువులను సర్దడంతోపాటు, పరిశోధనల్లో సాయపడుతుందని శాంసంగ్‌ తెలిపింది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని