‘Y’ సిరీస్‌లో వివో కొత్త ఫోన్లు..ధరెంతంటే..!

వివో కంపెనీ ఎప్పటికప్పడు సరికొత్త మోడల్స్‌ని తీసుకొస్తూ తన మార్కెట్‌ పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వై సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై31, వివో వై20జీ పేరుతో వీటిని పరిచయం చేశారు...

Published : 20 Jan 2021 21:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివో కంపెనీ ఎప్పటికప్పడు సరికొత్త మోడల్స్‌ని తీసుకొస్తూ తన మార్కెట్‌ పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వై సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై31, వివో వై20జీ పేరుతో వీటిని పరిచయం చేశారు. గతంలో వై సిరీస్‌లో వచ్చిన వై12ఎస్‌, వై51ఏ, వై20ఏ మోడల్స్‌కి కొనసాగింపుగా వీటిని తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్ల ప్రత్యేకతలు ఏంటి..ధరెంత..ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం..

వివో వై31  

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11తో పనిచేస్తుంది. 6.58-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్ ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక వైపు ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబులైజేషన్ ‌(ఈఐఎస్‌), సూపర్‌ నైట్ మోడ్‌తో ట్రిపుల్ కెమెరా ఇస్తున్నారు. వీటిలో 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరా, 2 ఎంపీ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

వివో వై20జీ

వై20జీలో మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.51-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 11తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనక వైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ పొట్రెయిట్ సెన్సర్‌, 2 ఎంపీ మాక్రో సెన్సర్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. సైడ్‌ మౌంట్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 

ధర

వివో వై31 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ. 16,490. ఓషియన్‌ బ్లూ, రేసింగ్ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఇక వై20జీ 6జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత స్టోరేజ్‌ ధర రూ. 14,990. ఒబ్సిడియన్‌ బ్లాక్‌, ప్యూరిస్ట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్‌ సహా అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చెయ్యొచ్చు. 

ఇవీ చదవండి..

ఫొటోలపై వాటర్‌మార్క్‌.. వేసుకోండిలా..! 

సీఈఎస్‌ 2021లో అదరగొట్టిన బెస్ట్ ఉత్పత్తులివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు