Hyd News: ‘బ్యాంకు క్యాషియర్‌’ కేసులో ఊహించని మలుపు!

బ్యాంకు సొమ్ము అపహరించి అదృశ్యమైన క్యాషియర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుడు హయత్‌నగర్‌ న్యాయస్థానంలో సోమవారం లొంగిపోయాడు. 

Updated : 17 May 2022 06:47 IST

 హయత్‌నగర్‌ కోర్టులో లొంగిపోయిన ప్రవీణ్‌కుమార్‌
 బ్యాంకు సిబ్బంది ఇరికించారంటూ ఆరోపణ

వనస్థలిపురం, న్యూస్‌టుడే: బ్యాంకు సొమ్ము అపహరించి అదృశ్యమైన క్యాషియర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుడు హయత్‌నగర్‌ న్యాయస్థానంలో సోమవారం లొంగిపోయాడు. 

అసలేం జరిగిందంటే.. 

ఈ నెల 10న వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.23.53లక్షల నగదుతో క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాయమయ్యాడు. ఆన్‌లైన్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటైన తాను నష్టపోయానంటూ తల్లికి వీడియో సందేశం పంపాడు. కోల్పోయిన సొమ్మును బెట్టింగ్‌లతో తిరిగి సంపాదిస్తే వచ్చి డబ్బు ఇచ్చేస్తానంటూ వివరించాడు. నష్టపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. అదే రోజు బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండ్రోజుల తరువాత ప్రవీణ్‌ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులో పోయిన సొమ్ముతో తనకేం సంబంధం లేదంటూ ఆవేదన వెలిబుచ్చాడు. బ్యాంకు మేనేజర్‌ కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ ద్విచక్రవాహనం చిట్యాల బస్టాండ్‌ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో నాటకీయ ఫక్కీలో నిందితుడు హయత్‌నగర్‌ కోర్టులో లొంగిపోయాడు.

తప్పునాది కాదు.. బయటకొచ్చాక నిరూపిస్తా 

న్యాయస్థానంలో లొంగిపోయేందుకు వచ్చిన ప్రవీణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. బ్యాంకులో కనిపించకుండా పోయిన నగదుతో తనకెటువంటి సంబంధంలేదని పేర్కొన్నారు. బ్యాంకులో డబ్బును బీరువాల్లో దాచేచోట సీసీ టీవీ కెమెరాలు అమర్చలేదన్నారు. గతేడాది డిసెంబర్‌లో రూ.లక్ష అకౌంట్‌లో తక్కువగా వస్తే ఇంట్లో నుంచి ఆ డబ్బును సర్దినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు చెప్పానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే బ్యాంకు ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆపారన్నాడు. ఈ నెల 10న రూ.4లక్షల నగదు ఖాతాలో తక్కువ రావటంతో అక్కడి నుంచి వెళ్లి పోయానన్నారు. ఇప్పటికి ఆ డబ్బులు ఎవరూ తీసారో తెలియదన్నారు. బ్యాంకులో అంతర్జాతీయస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ ఖాతాల్లో జరుగుతున్న గోల్‌మాల్‌  తాను బయటకు వచ్చాక బయటపెడతానన్నాడు. కోర్టులో లొంగిపోయిన ఇతనికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. నిందితుడిని కస్టడీకి కోరుతూ వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు.

వనస్థలిపురం నుంచి బెంగళూరుకు 

వనస్థలిపురంలో అదృశ్యమైన ప్రవీణ్‌ ద్విచక్రవాహనంపై చిట్యాల చేరాడు. ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు వెళ్లినట్లు ప్రవీణ్‌ తెలిపాడు. అక్కడి నుంచి ఒక సెల్‌ఫోన్‌ సహాయంతో ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో పెట్టానని తెలిపాడు. తాను మరణిస్తే నిజాలు బయటకురావనే ఉద్దేశంతో లొంగిపోయినట్లు వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని