డెంగీ విజృంభణ

రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా..మరోవైపు డెంగీ పంజా విసురుతోంది. వరసగా వర్షాలు కురుస్తుండటం ..పలుచోట్ల ఇళ్లలో, పరిసరాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి

Published : 11 Oct 2021 02:52 IST

5 వారాల్లోనే 2,443 మంది బాధితులు

12 జిల్లాలపై ప్రభావం

మరోవైపు మలేరియా భయం

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా..మరోవైపు డెంగీ పంజా విసురుతోంది. వరసగా వర్షాలు కురుస్తుండటం ..పలుచోట్ల ఇళ్లలో, పరిసరాల్లో నీళ్లు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అదే స్థాయిలో డెంగీ జ్వరాల బారిన పడేవారి సంఖ్యా పెరుగుతోంది. గత అయిదు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2443 కొత్త కేసులు నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా..రాష్ట్రంలో మరో 11 జిల్లాల్లోనూ ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ దోమలు కుట్టకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆగస్టు నుంచి పెరిగిన ఉద్ధృతి

ఈ ఏడాదిలో జనవరి నుంచి జులై వరకూ డెంగీ కేసులు పరిమిత సంఖ్యలోనే నమోదయ్యాయి. ఆగస్టు నుంచి ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 601 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్క ఆగస్టులోనే దాదాపు రెండింతలు అధికంగా(1,720) నమోదయ్యాయి. సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ 2,443 నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో మలేరియా కేసులు కూడా తగ్గడం లేదు. గత 5 వారాల్లో కొత్తగా 107 మంది మలేరియా బారినపడినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఏటా ఆగస్టు-అక్టోబరు మధ్య కాలంలో డెంగీ కేసులు పెరుగుతుంటాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమలు నిల్వ ఉన్న నీరు, చెత్తలో వృద్ధిచెందుతాయి. ఇళ్లతోపాటు బడులు, కళాశాలలు, కార్యాలయాల్లో కుట్టడానికి అవకాశాలుంటాయి. సాధ్యమైనంత వరకూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా పాత టైర్లు, ఎయిర్‌కూలర్లు, వాడేసిన వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. దోమతెరలు వాడాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఏడాదిలో అక్టోబరు 4 నాటికి అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన జిల్లాలు

ఆదిలాబాద్‌ 158, హైదరాబాద్‌ 1,189, కరీంనగర్‌ 115, ఖమ్మం 579, భద్రాద్రి కొత్తగూడెం 209, మహబూబ్‌నగర్‌ 346, మేడ్చల్‌ మల్కాజిగిరి 279, నిర్మల్‌ 141, నిజామాబాద్‌ 210, రంగారెడ్డి353, సంగారెడ్డి 109, సూర్యాపేట 164.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని