అక్షర బోధన వదిలి గానుగ సాధన

వారిద్దరూ ప్రైవేటు ఉపాధ్యాయులు.. అరకొర జీతాల కొలువును వదిలేసి వినూత్న ఆలోచనతో మళ్లీ సంప్రదాయ కట్టె గానుగ వ్యాపారంపై దృష్టి పెట్టారు. లాభాలబాట పట్టారు. ఒకరు మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన

Updated : 10 Jan 2022 05:03 IST

ఇద్దరు యువకుల వినూత్న ఆలోచన
ఎద్దులు, కట్టె గానుగతో నూనె తయారీ
నెలకు రూ. 1.20 లక్షల వరకు ఆర్జన  

ఎద్దు గానుగ ద్వారా పల్లీ నూనె తయారీ

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: వారిద్దరూ ప్రైవేటు ఉపాధ్యాయులు.. అరకొర జీతాల కొలువును వదిలేసి వినూత్న ఆలోచనతో మళ్లీ సంప్రదాయ కట్టె గానుగ వ్యాపారంపై దృష్టి పెట్టారు. లాభాలబాట పట్టారు. ఒకరు మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన బస్వరాజ్‌ కాగా మరొకరు గండీడ్‌ మండలంలోని జక్లపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి. రామకృష్ణ సేవా సమితిలో వాలంటీర్లుగా పని చేసే క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. 2018లో శ్రీనివాస్‌రెడ్డి తల్లి అనారోగ్యానికి  గురవడంతో ఆరోగ్యానికి మంచిదని గానుగ నూనె తెచ్చి వంటకు వాడేవారు. అప్పుడే వారికి ఆ రంగంపై ఆసక్తి ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ యువకులు కొలువులు మానేసి ఎద్దు గానుగలు ప్రారంభించిన విషయం తెలిసి అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకుని వచ్చారు. 2019 ఆగస్టులో గండీడ్‌ మండలం జక్లపల్లి గ్రామంలోని శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ భూమిలో షెడ్డు ఏర్పాటు చేసి గానుగ, రెండు ఎద్దులు కొని తెచ్చి నూనె తయారీ ప్రారంభించారు. రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. క్రమంగా ఆదరణ పెరగడంతో ఒక్కొక్కటి పెంచుకుంటూ 2020 ఏప్రిల్‌ నాటికి మొత్తం ఆరింటిని నెలకొల్పారు. బ్యాంకు ద్వారా కొంత, ఖాదీబోర్డు నుంచి 35% రాయితీతో  ఇంకొంత రుణం తీసుకుని ఈ వ్యాపారం విస్తరించారు.  


మరికొందరికి ఉపాధి

ముడిసరకును మహబూబ్‌నగర్‌ నుంచి తెచ్చుకునేవారు. నిర్వహణ, రవాణా, ఇతర ఖర్చులు కలిపి లీటరు రూ.385 చొప్పున అమ్ముతున్నారు. కొబ్బరి, తెల్ల కుసుమలు, నువ్వులు, అవిసెలు, ఆవ నూనె కూడా తయారు చేస్తున్నారు. వేప, ఇప్ప, ఆముదం నూనెలను కూడా తీయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ సంస్థ ద్వారా సింగపూర్‌, దుబాయిలకు నెలకు వెయ్యి లీటర్ల నూనె పంపిస్తున్నారు. త్వరలో మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ఖర్చులు పోగా ఒక్కో గానుగ ద్వారా నెలకు రూ. 20,000 మిగులుతున్నాయి. మొత్తం ఆరింటి ద్వారా నెలకు రూ. 1.20 లక్షలు సంపాదిస్తున్నారు. మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ వ్యాపారం చేయాలనుకునేవారికి ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు.


ఈ నూనె శ్రేష్ఠమైనది
- శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్‌

‘ఎద్దు గానుగ నూనె ఎంతో శ్రేష్ఠమైనది. పూర్వం గ్రామాల్లో గానుగల ద్వారానే నూనెలు తయారు చేసేవారు. యాంత్రీకరణ వల్ల ఈ వ్యవస్థ కనుమరుగైంది. సామాజిక సేవతో పాటు మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ వ్యాపారం లాభాలను తెచ్చిపెడుతుండడం సంతోషకరం.’

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని