Published : 29 Jan 2022 04:05 IST

దాతలు లేక.. దిక్కు తోచక!

తగ్గుతున్న విరాళాలు.. భారమవుతున్న నిర్వహణ

కరోనా నేపథ్యంలో అనాథ, వృద్ధాశ్రమాలు విలవిల

ఆదుకునేవారి కోసం ఎదురుతెన్నులు

ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌: పండగొచ్చినా పబ్బమొచ్చినా.. పుట్టినరోజైనా పెళ్లిరోజైనా ఏదో ఒక సందర్భాన్ని చూసుకుని ప్రజలు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను సందర్శించేవారు.. అక్కడ తలదాచుకునే దీనులకు ధన, వస్తు, ఆహార రూపేణా తోచినరీతిలో సహకరించేవారు.. అది ఒకప్పటి పరిస్థితి! కరోనా దెబ్బకు చితికిన జనం.. ఈ ఆశ్రమాల వైపు చూడటం దాదాపు మానేశారు.. ఆంక్షలూ అందుకు తోడయ్యాయి.. ఫలితంగా వీటిలో ఆశ్రయం పొందేవారికి సరిపడా బలవర్ధక ఆహారం, చికిత్స అందించడం నిర్వాహకులకు సమస్యగా మారింది.. ఉదారుల కోసం ఎదురుచూడటం తప్పనిసరి అవుతోంది. ఇదీ ఇప్పటి దైన్య స్థితి!!

* హైదరాబాద్‌లోని బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమంలో 120 మంది మతిస్థిమితం లేనివారు ఆశ్రయం పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం వారిలో 42 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొన్నిరోజులుగా విరాళాలిచ్చేవారూ తగ్గిపోయారు. నెలకు సగటున 10 మంది వరకూ ఆశ్రమానికి అన్నదానం చేసేవారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్కరూ రాలేదు. దాతల నుంచి ఆర్థిక సాయమూ తగ్గిపోయింది. నిర్వాహకులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. నగరంలోని దాదాపు 300 వరకు ఆశ్రమాల్లో ఇదే రకం దైన్యత నెలకొంది. మున్ముందు ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయేమోనని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
* పుట్టినరోజు, పెళ్లిరోజు..వంటి వివిధ సందర్భాల్లో అన్నదానం లేదా ఆర్థిక సాయం చేసేవారు ఇప్పుడు సగం మేర తగ్గిపోవడంతో నిర్వహణ కష్టమవుతోందని ఆశ్రమాల ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1000 ఆశ్రమాలు ఉన్నట్లు అంచనా. వీటిలో గ్రేటర్‌ పరిధిలోనే 500 వరకూ స్వచ్ఛంద సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. ట్రస్టుల పరిధిలో ఉండేవాటికి అంతగా ఇబ్బంది లేకున్నా.. విరాళాల మీద ఆధారపడే వాటికి కష్టాలు తప్పటం లేదు.
* కరోనా కారణంగా వ్యాపారాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. కొన్ని వేతనాలు తగ్గించాయి. అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎంతోకొంత ప్రభావితమయ్యారు. ఈ ప్రభావం ఆశ్రమాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

అసలే అనాథలు.. ఆపై ఆనారోగ్య సమస్యలు

ఇతరులతో పోలిస్తే అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండేవారి పరిస్థితి భిన్నం. ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారు. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువ. ఇలాంటి వారు కరోనా బారిన పడితే తప్పక  బలమైన ఆహారం, సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. సేవలందించేందుకు తాము సిద్ధంగానే ఉన్నా.. నిధుల కొరతతో నిర్వహణ భారమవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి

కరోనాతో దాతలు తగ్గిపోయి ఆశ్రమాల నిర్వహణ కష్టసాధ్యమవుతోంది. కొన్ని సంస్థలు మూతపడుతున్నాయి. దీన్ని గమనించి ప్రభుత్వం ఆశ్రమాలను ఉదారంగా ఆదుకోవాలి. ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరకులు అందించాలి.

- రాఘవేంద్ర, చిల్డ్రన్‌ ఆర్గనైజేషన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, వాత్సల్యం ఫౌండేషన్‌


దాతలు తగ్గిపోతున్నారు

కరోనా ఆంక్షల నేపథ్యంలో దాతలు ఆశ్రమానికి రావడం లేదు. వారి కోసం ఎదురుచూస్తున్నాం. ఆశ్రమంలో పిల్లలు వైరస్‌ బారినపడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

- ఎల్లయ్య, ప్రాజెక్టు ఇన్‌ఛార్జి, రెయిన్‌బో హోమ్‌ సంస్థ, ముషీరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని