స్థిరాస్తి వివాదాల్లో ‘పేలుతున్న తూటాలు’

సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్‌ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

Published : 13 Mar 2022 04:57 IST

రాష్ట్రంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి

ఉత్తరాది నుంచి అక్రమంగా దిగుమతి

కట్టడికి ప్రణాళిక రూపొందిస్తున్న పోలీసులు

* సిద్దిపేట వద్ద దుబ్బాక-గజ్వేల్‌ రహదారిపై గత బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణపై దగ్గరి బంధువే అయిన తిరుపతి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.


* ఈ నెల 1న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందారు.


* జనవరి 31న సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కారుపై కాల్పులు జరిపి రూ.43.5 లక్షలు దోచుకెళ్లారు.


* గత నవంబరులో హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్థిరాస్తి కమీషన్‌కు సంబంధించి మొదలైన వివాదంలో భాగంగా తోట నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి వరుసకు సోదరుడయ్యే తోట విజయభాస్కర్‌రెడ్డిని పిస్తోలుతో కాల్చిచంపాడు.


రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు నెలల వ్యవధిలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి అధికారులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట తదితర ప్రాంతాల్లో నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు తుపాకులు పేలడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉత్తరాది నుంచి ఆయుధాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయని.. వాటిని సరఫరా చేసే ముఠాలు రంగంలోకి దిగాయని వారు భావిస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 88 ఆయుధాలు, 171 రౌండ్ల మందుగుండు పట్టుబడిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ పెరుగుతున్న ఈ ఆయుధాల సంస్కృతి ఎటువైపు దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రూ.10 వేలకో రివాల్వర్‌

ఇబ్రహీంపట్నం జంట హత్యలకు వాడిన ఆయుధాలను ప్రధాన నిందితుడు మట్టారెడ్డి బిహార్‌ నుంచి తెప్పించాడు. ఒక పిస్తోలు, ఒక రివాల్వర్‌, 21 రౌండ్లు కలిపి రూ.1.1 లక్షలకు కొనుగోలు చేశాడు. బిహార్‌లోని శివాన్‌ జిల్లాకు చెందిన సమీర్‌ అలీ ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు. ఇందుకోసం మట్టారెడ్డికి సంబంధించినవారు కారులో వెళ్లారు. ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో జనం రాష్ట్రానికి ముఖ్యంగా రాజధానికి చేరుకుంటున్నారు. దళారులు వారి ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. కొనుగోలుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. రూ.10 వేలు పెడితే రివాల్వర్‌, రూ.30 వేలకు ఆటోమేటిక్‌ పిస్తోలు అమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ, రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌, పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలతోపాటు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని అనేక ప్రాతాల్లో ఆయుధాలు తయారు చేస్తున్నారు. గత ఏడాది బిహార్‌ రాజధాని పట్నా సమీపంలోని సబల్‌పుర్‌ గ్రామంలో ఓ ఆయుధ తయారీ పరిశ్రమపై స్థానిక పోలీసులు దాడి చేశారు. భద్రతా సంస్థలు వాడే ఆటోమేటిక్‌ పిస్తోళ్లు రోజుకు 15 వరకూ తయారు చేసి ఒక్కోటి రూ.6500లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఉదంతాలు ఉత్తరాదిలో కోకొల్లలు.

కొందరికి ఆయుధాల రవాణాయే వృత్తి..

హైదరాబాద్‌లో ఆయుధాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అధికారికంగా లైసెన్సులు ఇవ్వడాన్ని కఠినతరం చేశారు. ఉన్న లైసెన్సులనూ క్రమంగా తగ్గిస్తున్నారు. దాంతో అనేకమంది ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయుధాల రవాణాను కొందరు వృత్తిగా మలచుకుంటున్నారని, నగరానికి చెందిన పలువురు యువకులు మహారాష్ట్రలోని నాందేడ్‌, ఔరంగాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఉన్న అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘గతంలో వ్యవస్థీకృత ముఠాలు నేరాలకు పాల్పడేవి. ఇందులో ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకొని తమకు సమాచారం ఇచ్చేవారు. దాంతోపాటు ఆ ముఠాల వివరాలు మా రికార్డుల్లో ఉంటాయి కాబట్టి మేమూ గమనిస్తూ ఉండేవారం. ఇప్పుడు ఎవరికివారే నేరాలకు పాల్పడుతుండటం, ఆయుధాలు తెప్పించుకుంటుండటంతో సమాచారం అందడం కష్టంగా మారింది’ అని రాచకొండకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని