మళ్లీ తెరపైకి ‘మహిళా విశ్వవిద్యాలయం’

రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. మరో రెండేళ్లలో వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించాలని క్రీడల విధానంపై నియమించిన మంత్రివర్గ

Published : 15 Jan 2022 03:27 IST

కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా  మారుద్దామన్న మంత్రి కేటీఆర్‌
రూ.వంద కోట్లు అవసరమని  2018లో ఓయూ అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. మరో రెండేళ్లలో వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించాలని క్రీడల విధానంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదించారు. ఈక్రమంలో త్వరలోనే ప్రభుత్వం దీనిపై విద్యాశాఖను ప్రతిపాదనలు అడిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) ఏపీకి పరిమితం కాగా.. తెలంగాణలోనూ మహిళా వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2018 మార్చిలో రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా ఉన్నతీకరించాలని భావించారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి దిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు సైతం జరిపారు. రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.100 కోట్లు వెచ్చిస్తే అన్ని వసతులతో  విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంచనా వేసింది. తర్వాత పలు కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఓయూకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల.. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదాతో పాటు మూడుసార్లు న్యాక్‌ గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటికే చాలావరకు మౌలిక వసతులున్నందున వర్సిటీగా మార్చినా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ప్రయోగశాలలు, వసతిగృహాలు, ఆడిటోరియం తదితర వసతులు కల్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని