AP Budget 2022: గొప్పలకు పోయి అప్పులు

రాని ఆదాయాన్ని లెక్కల్లో చూపిస్తూ.. అప్పుల కుప్పల్ని మరింత పెంచేస్తూ.. బడ్జెట్‌ అంచనాల్ని ఘనంగా చూపిస్తూ.. ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల వంటి..

Updated : 12 Mar 2022 05:15 IST

అంకెల గారడీగా ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌
భారీగా పెరిగిన పద్దు
వద్దనుకున్న మద్యమే రాబడికి ముద్దు
అభివృద్ధి ఊసు లేదు
ఈనాడు - అమరావతి

రూ.2,56,256.56 కోట్లు..!
ఇదేదో ఫ్యాన్సీ నంబర్‌ అనుకునేరు..!.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ పద్దు..!

రాని ఆదాయాన్ని లెక్కల్లో చూపిస్తూ.. అప్పుల కుప్పల్ని మరింత పెంచేస్తూ.. బడ్జెట్‌ అంచనాల్ని ఘనంగా చూపిస్తూ.. ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల వంటి.. నిర్మాణాత్మక కార్యక్రమాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టేశారు. హైకోర్టు ఆదేశాల్నీ పెడచెవిన పెట్టి, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపించారు. మద్యనిషేధం హామీపై మళ్లీ మడమ తిప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ ఎక్సైజ్‌ ఆదాయాన్ని ఏకంగా రూ.16,500 కోట్లుగా అంచనా వేశారు. మద్యం నుంచి మరింత ఆదాయం పిండుకోవడమే తమ సర్కారు లక్ష్యమని చెప్పకనే చెప్పేశారు. వివిధ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు.. నేతి బీరలో నెయ్యి చందమే అని మరోసారి నిరూపించారు. పెండింగ్‌ బిల్లులు ఎలా చెల్లిస్తారో చెప్పకుండా అస్పష్టత కొనసాగించారు. రాజధాని, పెండింగ్‌ బిల్లులపై హైకోర్టు తీర్పును ప్రభుత్వ పెద్దలు విస్మరించేసినట్లే కనిపిస్తున్నారు. 

అంచనాల్లో తగ్గేదేలే..

వాస్తవ రాబడిని అంచనాల్లో పేర్కొనకుండా, కేంద్రం నుంచి, ఇతర రూపాల్లో వచ్చే నిధుల్నీ భారీగా ఊహిస్తూ... భారీ అంచనాలతో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ అదే చేసింది. ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలకు, చేస్తున్న ఖర్చుకూ పొంతన ఉండటం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో 83 శాతమే ఖర్చు చేయగా, 2021-22 బడ్జెట్‌ అంచనాల్నీ ప్రభుత్వం కుదించింది. రూ.2.29 లక్షల కోట్ల అంచనాల్ని రూ.2.09 లక్షల కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ ఏకంగా రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. మూలధన వ్యయం అంచనాల్లోనూ ఎక్కడా తగ్గలేదు. ఏకంగా రూ.30,679 కోట్లను మూలధన వ్యయంగా ప్రతిపాదించారు. 2021-22 బడ్జెట్‌లోనూ మూలధన వ్యయాన్ని రూ.31,198 కోట్లుగా అంచనా వేశారు. సవరించిన అంచనా ప్రకారం చేసిన ఖర్చు రూ.18,529 కోట్లు మాత్రమే. ఆదాయం అంచనాలకు, వాస్తవ రాబడికీ పొంతన లేకపోయినా.. అంకెల విన్యాసాలు మాత్రం మానడం లేదు. 2020-21లో రెవెన్యూ ఆదాయం రూ.1,61,958 కోట్లు వస్తుందనుకుంటే రూ.1,17,136.18 కోట్లే వచ్చింది. 2021-22లో రూ.1,77,196 కోట్లు వస్తుందనుకుంటే జనవరి వరకు వచ్చింది రూ.1.11 లక్షల కోట్లే. అయినా తగ్గకుండా 2022-23 బడ్జెట్‌లో మళ్లీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా చూపించారు.

అప్పుల్లో అదే దూకుడు..

ఇప్పటికే చేసిన రుణాలు కొండలా పేరుకుపోతున్నా.. కొత్త అప్పులకూ వైకాపా ప్రభుత్వం ఎక్కడా జంకడం లేదు. ప్రజా రుణంతో పాటు, కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇవ్వడం ద్వారానూ భారీగా అప్పులు చేస్తోంది. 2022-23లో రూ.55 వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణాలతో కలిపి, రాష్ట్ర ఆదాయాన్ని రూ.1,91,225 కోట్లుగా పేర్కొంది. రెవెన్యూ లోటును రూ.17,036 కోట్లుగా పేర్కొంది. గత అనుభవాల్ని బట్టి చూస్తే, ప్రభుత్వం రెవెన్యూలోటు నియంత్రణకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్ల ఇది అనేక రెట్లు పెరుగుతోంది. 2021-22 బడ్జెట్‌ అంచనాల్లో వివిధ నగదు బదిలీ పథకాలకు రూ.48,083 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల ప్రకారం రూ.39,615.98 కోట్లుగా చూపించింది. అంటే రూ.8,217 కోట్ల వరకు కోత వేసింది. హాజరుతో ముడిపెట్టి ఈ సంవత్సరం అమ్మఒడి పథకాన్ని ఎగ్గొట్టి సుమారు రూ.6,500 కోట్లు మిగుల్చుకుంది. వసతి దీవెనలో రూ.1,134 కోట్లు, విద్యా దీవెనలో రూ.449.13 కోట్లు, సామాజిక భద్రతా పింఛన్లలో రూ.247.55 కోట్లు, రైతులకు సున్నా వడ్డీ పథకంలో 124.13 కోట్లు మిగిలింది.

సున్నకు సున్న.. హళ్లికి హళ్లి!

* నవరత్నాలు, ఉచిత పథకాలకు తప్ప... వ్యవసాయం, సాగునీరు వంటి ప్రాధాన్య రంగాలకు అంతంత మాత్రం కేటాయింపులతోనే సరిపెట్టారు. 2022-23 బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.11,482 కోట్లు కేటాయించారు. దీనిలో జీతాలు, రెవెన్యూ వ్యయాలు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులు పోగా, నికరంగా ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించేది అతి స్వల్పం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రూ.43,052 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
* మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం, మూడేళ్లయినా దాన్ని అమలు చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ నుంచి ఏకంగా రూ.16,500 కోట్లు ఆదాయం పిండుకోవాలని నిర్ణయించడంతో.. నాలుగో ఏడాదీ మద్యనిషేధం అమలు కొండెక్కినట్లే కనిపిస్తోంది. మనబడి, నాడు-నేడు పథకం నిధుల్లోనూ కోత పెట్టింది. రూ.4,535 కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్‌లో రూ.3,500 కోట్లే ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాలకు కేటాయింపుల్లోనూ కోత పెట్టారు.
* కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు పేరుతో మళ్లీ మాయాజాలం చేశారు. వివిధ కార్పొరేషన్లకు ఈసారీ నిధుల పుష్కలంగానే కేటాయించినట్టు చూపించారు. కానీ నవరత్నాల్లో భాగంగా అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులనే.. కార్పొరేషన్ల ఖాతాలో వేసి అక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారు. కార్పొరేషన్లు ఆ నిధులు సొంతంగా వాడుకోవడానికి లేదు. దీనివల్ల స్వయం ఉపాధి కల్పన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.
* వైఎస్సార్‌ పెళ్లికానుక పథకానికి 2022-23 బడ్జెట్‌లోనూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు వడ్డీ చెల్లింపునకు ఉద్దేశించిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి నిధుల్లోనూ కోత పెట్టారు. వసతి దీవెన, వాహన మిత్ర పథకాలకు నిధుల్లోనూ కోత పడింది.
* కీలకమైన రైల్వే ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర వాటా కింద రూ.1,998 కోట్లు ఇవ్వాలని రైల్వే శాఖ కోరితే రూ.200 కోట్లతో సరిపెట్టారు. బడ్జెట్‌లో సివిల్‌ పనులకు రూ.50 కోట్లు, భూసేకరణకు రూ.150 కోట్లు మాత్రం ప్రతిపాదించారు.  
* భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లయితే, బడ్జెట్‌లో ప్రతిపాదించింది రూ.411.62 కోట్లు మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని