TRS Plenary: గులాబీ ప్లీనరీ రేపే

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సర్వ ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ)కు రంగం సిద్ధమైంది. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ప్లీనరీకి

Updated : 24 Sep 2022 14:25 IST

ఆరున్నరవేల మందికి ఆహ్వానాలు

ఏడు తీర్మానాలపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం జరిగే తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సర్వ ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ)కు రంగం సిద్ధమైంది. మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ప్లీనరీకి పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. 2018లో చివరిసారిగా హైదరాబాద్‌లో ప్లీనరీ జరిగింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, కరోనా కారణంగా 2019, 20లలో జరగలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తెరాస మళ్లీ ప్లీనరీకి సమాయత్తమైంది. పదిరోజులుగా హెచ్‌ఐసీసీలో సన్నాహాలు సాగుతున్నాయి. వేదిక, ప్రాంగణం ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రతినిధులనే ఆహ్వానించారు. ప్రజాప్రతినిధుల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్మన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభం

ప్లీనరీ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని 10.45 గంటలకల్లా ప్రాంగణంలో ఆశీనులవుతారు. 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తెరాస అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటిస్తారు. అనంతరం సీఎం ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఏడు తీర్మానాలను ప్రతిపాదిస్తారు. ఒంటి గంటకు భోజనవిరామం అనంతరం వాటిపై చర్చ నడుస్తుంది.

నోరూరించే వంటలు

ప్లీనరీలో 500 మంది నిపుణులు 29 రకాల వంటలను వండనున్నారు. ఒకేసారి 8 వేల మంది భోజనం చేసేలా మూడు హాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజా ప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలుంటాయి. దమ్‌చికెన్‌ బిర్యానీ, మటన్‌కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, రుమాల్‌రోటీ, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ఉలవచారు ఇందులో ఉంటాయి. హెచ్‌ఐసీసీ సమీపంలో 50 ఎకరాల్లో పార్కింగ్‌ ఉంటుంది.

ప్లీనరీ పాట విడుదల

ప్లీనరీ నేపథ్యంలో పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్‌ రూపొందించిన ‘గులాబీ జెండా కేసీఆర్‌’ పాట ఆడియో సీడీని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం తెలంగాణభవన్‌లో విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ ఈ పాటను రాశారు.

గులాబీమయంగా నగరం.. ప్రపంచ రికార్డుకు ప్రయత్నం

ప్లీనరీ ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్‌ రోడ్లన్నీ కేసీఆర్‌ కటౌట్లు, తెరాస సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. ప్రముఖ శాండ్‌ఆర్టిస్ట్‌ కాంత్‌రిసా 20 మీటర్ల వెడల్పుగల కాన్వాస్‌పై  ఇరవై ఏళ్ల తెరాస ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి తెరాస శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.  ప్రాంగణం వద్ద కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు, వేలాది ఫొటోలతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ జీవిత చరిత్రను చూపించనున్నారు. తెరాస పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెరాస ఏర్పాట్లతో యావత్‌ భాగ్యనగరం గులాబీమయంగా మారనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని