Vaccine: రోజుకు 350 మందికి టీకాలు

విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లనున్న రాష్ట్ర విద్యార్థుల కోసం ఈ నెల 5(శనివారం) నుంచి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆన్‌లైన్‌లో పేర్ల నమోదుకు శుక్రవారం....

Updated : 17 Aug 2022 12:23 IST

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నేటి నుంచి పంపిణీ
4 వారాలకే రెండు డోసు..
తొలి రోజు 3 వేల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లనున్న రాష్ట్ర విద్యార్థుల కోసం ఈ నెల 5(శనివారం) నుంచి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆన్‌లైన్‌లో పేర్ల నమోదుకు శుక్రవారం వెబ్‌సైట్‌ అందుబాటులోకి రాగా తొలిరోజు 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ కేటగిరీలో రోజుకు 350 మందికి టీకాలు వేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. శనివారం టీకాలు పొందనున్న తొలి 350 మందికి సంక్షిప్త సందేశాలు పంపారు. విడతల వారీగా దరఖాస్తు చేసిన విద్యార్థులందరికీ సంక్షిప్త సందేశాలు అందుతాయని, అందరికీ వ్యాక్సిన్‌ అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) సంచాలకులు డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సౌలభ్యం కోసం రెండో డోసు టీకా పొందే గడువును ప్రభుత్వం సడలించింది. ఈ విద్యార్థులు తొలిడోసు పొందిన 4 వారాలకే రెండో డోసు పొందడానికి అవకాశం కల్పించింది. కొవిషీల్డ్‌ అయినా.. కొవాగ్జిన్‌ అయినా ఇదే నిబంధన వర్తిస్తుందని శంకర్‌ వెల్లడించారు.

ఇవి తప్పనిసరి..

‘‘హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ టీకా పంపిణీ కొనసాగుతుంది. ఆదివారాలు, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ కార్యక్రమం ఉండదు. టీకా వేయించుకునేందుకు ప్రతి విద్యార్థి తన మొబైల్‌కు వచ్చిన సంక్షిప్త సందేశాన్ని, ఓటీపీని తప్పక చూపించాల్సి ఉంటుంది. పాస్‌పోర్టుతో పాటు వీసాను వెంట తెచ్చుకోవాలి. వీసా లేకపోతే.. ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారో ఆ సంస్థలో ప్రవేశపత్రాన్ని చూపించాలి. 18-44 ఏళ్ల మధ్య వయస్కులైన విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇక్కడ టీకా వేస్తారు. వారి తల్లిదండ్రులకు ఇవ్వరు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడైనా పోలీసులు ఆపితే.. మొబైల్‌లో ఉన్న సంక్షిప్త సందేశాన్ని చూపిస్తే అనుమతిస్తారు. రెండు డోసులు పొందిన అనంతరం ధ్రువపత్రాన్ని పీడీఎఫ్‌ రూపంలో, ముద్రించి పత్రరూపంలోనూ అందిస్తాం. ఒకవేళ అధికారికంగా బయట ఎక్కడైనా రెండు డోసుల టీకాలు పొందినట్లు విద్యార్థులు ఆధారం చూపిస్తే వారికి కూడా ధ్రువపత్రాన్ని అందజేస్తాం’’ అని డాక్టర్‌ శంకర్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని