కంపెనీలు బోగస్‌.. జీఎస్టీ ఓయస్‌

క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు (ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌) కొట్టేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఘరానా వ్యాపారులు, ఆడిటర్లు వందల సంఖ్యలో నకిలీ కంపెనీలు

Published : 03 Dec 2021 04:04 IST

రాయితీ నొక్కేసేందుకు నకిలీ పత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక నేరస్థుల దందా

ఈనాడు, హైదరాబాద్‌: క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు (ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌) కొట్టేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఘరానా వ్యాపారులు, ఆడిటర్లు వందల సంఖ్యలో నకిలీ కంపెనీలు సృష్టిస్తున్నారు. కాగితాలపై కంపెనీలు సృష్టించి నకిలీ ఇన్‌వాయిస్‌లను జీఎస్టీ కార్యాలయాల్లో సమర్పించి రూ.కోట్లలో రాయితీలు పొందుతున్నారు. జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఇవి వెలుగు చూస్తున్నాయి. గుంటూరు, హైదరాబాద్‌లలో 20 నకిలీ కంపెనీలు సృష్టించి కాగితాలపై రూ.260 కోట్ల ఇన్‌వాయిస్‌లు సమర్పించి రూ.31 కోట్ల జీఎస్టీ రాయితీని కొట్టేసిన ఒక ఆడిటర్‌ అరెస్ట్‌ కాగా.. పళని కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో హైదరాబాద్‌లో కంపెనీని స్థాపించి రూ.86 లక్షలు రాయితీ పొందిన కేసులో ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.

రూ.265 కోట్ల టర్నోవర్‌

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ జీఎస్టీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వ్యవహారాలను క్షుణ్నంగా తెలుసుకున్నాడు. పన్ను రాయితీలో లొసుగులను గుర్తించిన ఆయన ఏడాదిన్నర క్రితం కాగితాలపై 20 కంపెనీలను సృష్టించాడు. వాటిని రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ)లో నమోదు చేశాడు. గుంటూరు, హైదరాబాద్‌లలో పది చొప్పున వాటిని ప్రారంభించాడు. గుంటూరులోని కంపెనీల్లో ఉత్పత్తయ్యే వస్తువులను హైదరాబాద్‌ కంపెనీలకు విక్రయించినట్టు, హైదరాబాద్‌ కంపెనీలు వేర్వేరు కంపెనీలకు అమ్మేసినట్టు ఏడాది వ్యవధిలో రూ.265 కోట్లు టర్నోవర్‌ చేశానంటూ వైజాగ్‌ జీఎస్టీ కార్యాలయంలో నివేదికలను సమర్పించాడు. వీటిని పరిశీలించిన జీఎస్టీ అధికారులు అతడి టర్నోవర్‌ ఆధారంగా రూ.31 కోట్ల రాయితీని ఈ ఏడాది జూన్‌లో ఇచ్చేశారు. విజిలెన్స్‌ అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించారు. గుంటూరులో కంపెనీల చిరునామాలకు వెళ్లగా.. అక్కడ కంపెనీల్లేవు. పన్ను రాయితీ జమచేసిన బ్యాంక్‌ ఖాతాల ఆధారంగా పరిశోధించిన అధికారులు గతనెల 12న హైదరాబాద్‌కు వచ్చి ఆడిటర్‌ను అరెస్ట్‌ చేశారు.

ఆంథోనీ రాజ్‌... ఉత్తుత్తి నిర్మాణం

హైదరాబాద్‌ పళని కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో తమిళనాడుకు చెందిన ఆంథోనీరాజ్‌  హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని భవన నిర్మాణ సంస్థలకు  పరికరాలను విక్రయిస్తున్నానని జీఎస్టీ అధికారులకు పత్రాలు సమర్పిస్తున్నారు. గతేడాది జనవరిలో రూ.7.18 కోట్ల టర్నోవర్‌ చేశానని రూ.86 లక్షల పన్ను రాయితీ పొందారు. అనంతరం జీఎస్టీ అధికారులు పరిశీలించనగా ఆ చిరునామాలో పళని కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో ఎలాంటి కార్యాలయం లేదు. దీంతో  అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆంథోనీరాజ్‌కు సహకరించిన సత్యసాయినాథ్‌, వీరేష్‌కుమార్‌లను కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని