KTR: కేంద్రంపై అయిదంచెల ఉద్యమం

తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనుగోలుపై భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా..ఈనెల 4వ తేదీ నుంచి తెరాస అయిదంచెల పోరాట ఉద్యమ

Updated : 03 Apr 2022 05:38 IST

4న నిరసన దీక్షలతో ఆందోళనలు ప్రారంభం

11న చలో దిల్లీ... మంత్రులు, ప్రజాప్రతినిధుల నిరసనలు

తెలంగాణ రైతులను అవమానించేవారిని వదలం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనుగోలుపై భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా..ఈనెల 4వ తేదీ నుంచి తెరాస అయిదంచెల పోరాట ఉద్యమ కార్యాచరణను చేపడుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఏప్రిల్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న నాగ్‌పుర్‌, బెంగళూరు, ముంబయి, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోలు, 7న 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో నిరసనలు, 8న గ్రామ పంచాయతీల్లో రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తారని, దిష్టిబొమ్మలు దహనం చేస్తారని చెప్పారు. 11న దిల్లీలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, పురపాలక, నగరపాలక ఛైర్‌పర్సన్లు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, పార్టీ ఇతర నేతలతో నిరసన ప్రదర్శన చేపడతామన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో తెరాస శ్రేణులు, ప్రజాప్రతినిధులతో పాటు రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

శనివారం తెలంగాణభవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్నది మూర్ఖపు.. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, అన్నదాతలపై దయ, ప్రేమ లేదని, వారిని పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ దుయ్యబట్టారు. చివరి ధాన్యం గింజ కొనేవరకు కేంద్రంతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమేనని తెలిపారు. ‘‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తలాతోక లేదు. పేదలను దోచి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది. నూకలు తినాలని రాష్ట్ర రైతులు, ప్రజలను అవమానించింది. అన్నదాతల పక్షాన వెళ్లిన మంత్రులను పీయూష్‌ గోయల్‌ అవమానించారు.దున్నపోతు మీద వాన పడ్డట్లు  కేంద్రం వ్యవహరిస్తోంది. మేం యాసంగిలో వరిసాగు వద్దని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని  రైతులకు విజ్ఞప్తి చేశాం. యాసంగిలో ధాన్యం పండిస్తే కేంద్రమే కొంటుందని బండి సంజయ్‌ అన్నారు. భాజపా నేతలు.. వడ్లు వేసేలా రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడేమో కేంద్రం చేతులెత్తేసింది. కనీసం ఆహార భద్రత కింద ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడిగాం. అన్ని గ్రామాలు, మండల పరిషత్‌లు, నగరపాలికలు, జడ్పీలు, పీఏసీఎస్‌ల నుంచి ప్రధానికి, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌లకు తీర్మానాలు పంపాం. ఇప్పటికీ వాటిపై స్పందనలేదు. పైగా పార్లమెంటులో పీయూష్‌ అహంకారంతో పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలివి తక్కువవారంటూ తెలంగాణ ప్రజాప్రతినిధులను, రైతులను అవమానిస్తున్నారు’’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాట తప్పిన కేంద్ర మంత్రి
‘‘భాజపా నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలొస్తున్నాయి. ధాన్యం ఏదైనా కేంద్రం కొంటుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గతంలో ఇచ్చిన మాట తప్పారు. దిల్లీలో ఉన్న భాజపా కరెక్టా? రాష్ట్రంలోని భాజపా కరెక్టా? వడ్లు కొంటారా? లేదా? ఒకే నేషన్‌.. ఒకే రేషన్‌ అన్నారు.. మరి ధాన్యం విషయంలో పంజాబ్‌కో విధానం? తెలంగాణకో విధానమా? ఆహారభద్రత చట్టం కింద ఏ రాష్ట్రానికి చెందిన వడ్లనైనా ఎఫ్‌సీఐ కొనాల్సిందే. రారైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అని నిబంధనలు పెట్టొద్దు. తెరాస తరఫున 4 నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నాం. ఉభయసభల్లో కేంద్రం వైఖరిని ఎండగడతాం. పీయూష్‌ గోయల్‌పై పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిస్తాం. బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలివి తక్కువవాళ్లు. వీళ్లను వదిలేది లేదు. కేంద్రం తన వైఖరి మార్చుకునేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని