AP Cabinet: 11 మంది పాతవారు.. 14 కొత్త ముఖాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త మంత్రివర్గం 25 మందితో సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఇప్పటివరకూ మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్‌లోనూ స్థానం లభించింది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ,...

Updated : 11 Apr 2022 05:37 IST

నేడు కొలువుదీరనున్న ఏపీ కేబినెట్‌
ఎనిమిది జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం
ప్రతిపక్ష నేత జిల్లా నుంచి ఎక్కువ మందికి చోటు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త మంత్రివర్గం 25 మందితో సోమవారం ఉదయం కొలువుదీరనుంది. ఇప్పటివరకూ మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్‌లోనూ స్థానం లభించింది. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, అంజాద్‌ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామిలకు మరోసారి అవకాశం వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లా అయిన చిత్తూరు నుంచి అత్యధికంగా ముగ్గురికి కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది.


8 మంది ఓసీలు.. అయిదుగురు ఎస్సీలు.. 10 మంది బీసీలు

మంత్రివర్గంలో చోటు దక్కినవారిలో 8 మంది ఓసీలు, అయిదుగురు ఎస్సీలు, 10 మంది బీసీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి చెరొకరికి అవకాశం లభించింది. గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉండగా.. ఈసారి నలుగురు చోటు దక్కించుకున్నారు.


8 జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం

పీలోని 26 జిల్లాల్లో ఎనిమిది జిల్లాల నుంచి ఒక్కరికీ నూతన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో ఎవరూ మంత్రులు కాలేకపోయారు.నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ జిల్లా నుంచి ముగ్గురికి కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది.

శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల నుంచి చెరో ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్‌ఆర్‌, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కొక్కరే మంత్రులయ్యారు.


పాత ఎస్సీ మంత్రుల్లో సుచరిత మినహా..

స్సీ సామాజికవర్గం నుంచి గత మంత్రివర్గంలో పినిపే విశ్వరూప్‌, తానేటి వనిత, మేకతోటి సుచరిత, కె.నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్‌ కొనసాగారు. వీరిలో ఒక్క సుచరిత మినహా మిగతా నలుగురికీ కొత్త మంత్రివర్గంలోచోటు లభించింది.

నూతన మంత్రివర్గంలోనూ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు అయిదుగురే ఉండనున్నారు. సుచరిత బదులు మేరుగ నాగార్జునకు చోటు దక్కింది.


ఆ సామాజికవర్గం నుంచి మళ్లీ నలుగురికి..

ప్రభుత్వంలో కీలక ప్రాధాన్యం లభిస్తున్న ఓ సామాజికవర్గం నుంచి గత మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరిలో గౌతమ్‌రెడ్డి ఇటీవలే మరణించారు. ఈ వర్గం నుంచి ఈసారీ నలుగురికి అవకాశం లభించింది. పెద్దిరెడ్డి, బుగ్గనలకు కొత్త మంత్రివర్గంలోనూ చోటుదక్కింది. కొత్తగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆర్‌కే రోజా స్థానం దక్కించుకున్నారు.


ఆ నలుగుర్నీ తప్పించి.. కొత్తవారికి

రో ముఖ్యమైన సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబు, పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నానిలకు కొత్త కేబినెట్‌లో అవకాశం రాలేదు. వారికి బదులు అదే వర్గం నుంచి గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబులకు చోటు దక్కింది. ఈ నలుగురూ కొత్త ముఖాలే.


ఆ నాలుగు వర్గాలకు చోటే లేదు

కొత్త మంత్రివర్గంలో రాష్ట్రంలోని ప్రధానమైన ఓ నాలుగు సామాజిక వర్గాల నుంచి ఏ ఒక్కరికీ చోటు లభించలేదు. గత మంత్రివర్గంలో కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆయా వర్గాల నుంచి కొనసాగగా.. కొత్త కేబినెట్‌లో ఆ ముగ్గురి సామాజికవర్గాలకూ పదవులు ఇవ్వలేదు. ఇంకో సామాజికవర్గానికి పాత, కొత్త కేబినెట్లు రెండింటిలోనూ ప్రాతినిధ్యం లభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని