Sundara Naidu: పౌల్ట్రీ రంగ దిగ్గజం సుందరనాయుడు కన్నుమూత

బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు (85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం

Updated : 29 Apr 2022 05:49 IST

కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి

సీమ పల్లెల సర్వతోముఖాభివృద్ధిలో మమేకం

ఉద్యోగం వదిలేసి అన్నదాతలకు అండ

రైతు బాంధవుడిగా గుర్తింపు 

నేడు చిత్తూరుకు పార్థివదేహం..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం

బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు (85) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈనెల 6న ఆయనకు గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి పార్థివ దేహాన్ని చిత్తూరుకు తరలిస్తారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన సుందరనాయుడు.. కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.. చిత్తూరులో బాలాజీ హేచరీస్‌ స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు. సుందరనాయుడు మృతి పట్ల సీపీఐ నేత నారాయణ, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర ఛైర్మన్‌ డా.శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే పరీడా తీవ్ర సంతాపం తెలిపారు. సుందరనాయుడు 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించారు. నాన్న గోవిందునాయుడు, అమ్మ మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. వీరిది ఉమ్మడి వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. చదువులో చురుగ్గా ఉండే సుందరనాయుడు.. తన గ్రామంలోని యువతను చైతన్యపర్చడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా దృక్పథం, సమైక్య భావన అలవడింది. కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశువైద్యుడిగా పనిచేశారు. 1964 డిసెంబరు 9న ఆయనకు సుజీవనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. శైలజ, నీరజ. శైలజా కిరణ్‌.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.

పౌల్ట్రీ రంగానికి చేసిన కృషికి గానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు. పుణెలోని బి.వి.రావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరించారు. ‘నెక్‌’ జీవిత కాల ఆహ్వాన సభ్యుడిగా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా, అంతర్జాతీయ పౌల్ట్రీ సైన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, ఎగ్‌ కౌన్సెల్‌ సభ్యుడిగా విశేష సేవలందించారు. న్యూజెర్సీ ప్రభుత్వం ‘డూయర్‌ ఆఫ్‌ ది పౌల్ట్రీ ఇన్‌ సౌత్‌ ఇండియా’ పురస్కారంతో సత్కరించింది.

* హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైడ్‌ బేస్డ్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక కమిటీ బోర్డు సభ్యులుగా, చిత్తూరు జిల్లా కోళ్ల రైతుల సంఘం అధ్యక్షులుగా, విజయవాడలోని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా సేవలందించారు.

రాయలసీమలో సాగు అంటే సవాళ్లతో కూడిన వ్యవహారం. వర్షాలు అంతంతమాత్రంగా పడే ఈ ప్రాంతంలోని రైతులు, రైతు కూలీల వలసలు చూసి డాక్టర్‌ సుందరనాయుడు చలించి పోయారు. 1961లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా ప్రభుత్వ విధుల్లో చేరిన ఆయన చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పనిచేసేటప్పుడు ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అన్నదాతలు పౌల్ట్రీఫారాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా ఎదగడంతో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందుతుందని చెప్పినప్పటికీ.. సహాయ సహకారాలు లేక అప్పట్లో రైతాంగం వెనకడుగు వేసింది. దీంతో తానే ఈ రంగం వైపు మరలి.. నలుగురికి మార్గదర్శిగా నిలవాలని నిశ్చయించుకున్నారు. ఆరున్నరేళ్లుగా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని పౌల్ట్రీ రంగం వైపు అడుగులు వేశారు. 1968 ఫిబ్రవరిలో చిత్తూరులో 2 వేల కోడిపిల్లలతో ‘శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీఫాం’ను ప్రారంభించారు. ఆ తర్వాత సుందరనాయుడు అందించిన సహాయ సహకారాలు, స్ఫూర్తితో ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, తమిళనాడులలో వేల పౌల్ట్రీఫారాలు ఏర్పాటయ్యాయి. సీమ, నెల్లూరు జిల్లాల్లోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.

బి.వి.రావుతో అనుబంధం: దేశ పౌల్ట్రీ రంగ మార్గదర్శకుడైన బి.వి.రావుతో సుందర నాయుడికి సన్నిహిత సంబంధం ఉండేది. పరిశ్రమ ప్రారంభ దశలో ఇతర వ్యాపారులు గుడ్ల ఉత్పత్తులపైనా, గుడ్ల ధరలపైనా తమ పట్టు బిగించి పరిశ్రమను తమ గుప్పిట్లో బంధించారు. రైతులకు రావాల్సిన లాభాలు దళారులుగా మారిన వ్యాపారుల పరమయ్యేవి. ఈ సమస్యను అధిగమించడానికి బి.వి.రావుతో కలిసి సుందర నాయుడు దేశం నలుమూలలా తిరిగారు. ‘నా గుడ్డు- నా జీవితం- నా ధర’ నినాదంతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాని పర్యవసానంగా నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటైంది.


రైతుల కోసం ఊరూరా తిరిగారు
- మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

నాన్న సుందరనాయుడు బాంబే వెటర్నరీ కళాశాల నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందిన తర్వాత ప్రభుత్వ పశు సంవర్థక శాఖలో పశు వైద్యుడిగా కొన్ని రోజులు ఉద్యోగం చేశారు. కృష్ణా జిల్లాలో పౌల్ట్రీ రైతుల అభివృద్ధిని చూసి.. రాయలసీమలో కూడా అలాంటి అభివృద్ధిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి, చిత్తూరుకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో చిన్న పౌల్ట్రీఫాం ప్రారంభించారు. రెండేళ్ల వయసులో నేను అక్కడే పెరిగాను. వర్షాభావ, కరవు పీడిత ప్రాంతం రాయలసీమలో సరైన భూగర్భ జలాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో.. ప్రతి ఊరూ తిరిగి ఎంతోమందిని ప్రోత్సహించారు. దాదాపు 50 ఏళ్ల కిందట కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి.. ‘నేను ఉంటాను.. అన్ని రకాలుగా సహాయం చేస్తాన’ని చెప్పి కోళ్ల పెంపకం కోసం కృషి చేశారు. ప్రారంభంలో సైకిల్‌పై వెళుతూ అన్ని పనులు తనే చేసుకునేవారు. ‘ప్రతి దశలోనూ నేను తోడు ఉంటాను’ అని ఇచ్చిన భరోసా మేరకు.. ఎంతోమంది రైతులు ముందుకు వచ్చి వ్యవసాయ అనుబంధంగా పౌల్ట్రీ చేపట్టి గణనీయమైన పురోభివృద్ధి సాధించారు. చిత్తూరు జిల్లాలో మొదటిసారి అప్పట్లో సేంద్రియ వ్యవసాయం తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారు. మా ఫాంలో సేంద్రియ వ్యవసాయం, కోడి గుడ్ల ఉత్పత్తి, లాభదాయకతను చూసిన ఎంతోమంది రైతులు స్ఫూర్తి పొందారు. అలా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా అభివృద్ధి జరిగింది. అనేకమంది చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులు ఉన్నత స్థాయిలోకి వచ్చారు. తమ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించుకుని చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు. వారంతా నాన్న అంటే ఎంతో ప్రేమతో ఉంటారు. నిరంతరం పౌల్ట్రీ రైతులు, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కోసమే ఆయన పాటుపడ్డారు. ప్రతిరోజూ ఇంట్లో కూడా ఈ విషయంపైనే చర్చ ఉండేది. పది మంది రైతులతో మాట్లాడడం.. గుడ్లు, చికెన్‌ ధరలు పెంచడానికి ప్రయత్నాలు చేయడం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. రైతులకు సహాయం చేయాలన్న ధ్యాసలో పడి ఊరూరా తిరుగుతూ ఒక్కోసారి భోజనం కూడా చేసే వారు కాదు. తెల్లవారుజామున 4 గంటలకే ఫాంలో ఉండేవారు. కోళ్లు, వాటి పిల్లలకు ఏదైనా రోగాలు ప్రబలినా కూడా స్వయంగా తాను వైద్య సేవలు అందించేవారు. ఇందుకోసం ఎప్పుడూ మా ఇంటి ద్వారాలు తెరిచే ఉండేవి. ఆయన మరణం మాకు, మా కుటుంబానికే కాదు.. వేలాది రైతు కుటుంబాలకు కూడా తీరని లోటు. మా నాన్న అంతమంది రైతుల హృదయాల్లో స్థానం సంపాదించడం మాకు గర్వకారణం.


భావితరాలకు ఆదర్శం..
- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఒకరైన సుందర నాయుడు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. వారి కుటుంబ సభ్యులకు సైతం నేనంటే ఎంతో అభిమానం.సుందరనాయుడు జీవితం భావితరాలకు ఆదర్శం.


పౌల్ట్రీ రంగానికి తీరని లోటు
- తెదేపా అధినేత చంద్రబాబు

సుందరనాయుడు మృతి పౌల్ట్రీ రంగానికి తీరని లోటు. ఆయన వేల మందికి ఉపాధి కల్పించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.


- ఈనాడు, హైదరాబాద్‌,  ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, న్యూస్‌టుడే, చిత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని