3 రోజులు ధాన్యం టెస్ట్‌ మిల్లింగ్‌

రాష్ట్రంలో యాసంగి ధాన్యానికి ప్రయోగాత్మక(టెస్ట్‌) మిల్లింగ్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ) ఆధ్వర్యంలో

Published : 27 May 2022 05:02 IST

నేటి నుంచి పది జిల్లాల్లో నిర్వహణ
మైసూర్‌ సీఎఫ్‌టీఆర్‌ఐ ఆధ్వర్యంలో ప్రక్రియ
ప్రభుత్వ నిర్ణయంతో వీడిన చిక్కుముడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి ధాన్యానికి ప్రయోగాత్మక(టెస్ట్‌) మిల్లింగ్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ) ఆధ్వర్యంలో ఈ టెస్ట్‌ మిల్లింగ్‌ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గడిచిన 20 రోజులుగా నెలకొన్న చిక్కుముడి వీడింది. శుక్రవారం నుంచి మూడు రోజుల్లో ప్రయోగాత్మక మిల్లింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకోబోమని.. సాధారణ బియ్యమే తీసుకుంటామని కేంద్రం గతంలో స్పష్టంచేసింది. యాసంగిలో ధాన్యంలో తేమ శాతం తగ్గిపోవటంతో సాధారణ బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల నిబంధనల ప్రకారం క్వింటా ధాన్యానికి 68 శాతం బియ్యం ఇవ్వటం సాధ్యం కాదని రైస్‌మిల్లర్లు స్పష్టం చేశారు. నూకలు ఎక్కువగా రానున్న దృష్ట్యా ఆమేరకు నష్టపరిహారం చెల్లిస్తే 68 శాతం ప్రకారం బియ్యం ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నూకలు ఎన్ని వస్తాయి.. నష్టపరిహారం ఎంత ఇవ్వాలో నిర్ధారించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పడింది. తాజాగా టెస్ట్‌ మిల్లింగ్‌ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎఫ్‌టీఆర్‌ఐతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అవగాహనకు వచ్చింది.

జిల్లాకు రెండు మిల్లుల్లో..
పది జిల్లాల్లో ప్రయోగాత్మక మిల్లింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో రెండు మిల్లుల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇందుకు మూడు నుంచి నాలుగు జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకున్నారు. తాత్కాలికంగా వనపర్తి, యాదాద్రి, నల్గొండ జిల్లాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలను మరో యూనిట్‌గా, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, సిద్దిపేట జిల్లాలను మూడో యూనిట్‌గా ఏర్పాటు చేశారు. ఆయా యూనిట్ల బృందాలు మిల్లింగ్‌ ప్రక్రియను నిర్వహించి.. ప్రభుత్వం నియమించిన కమిటీకి నివేదికలు అందజేస్తాయి. వాటిని విశ్లేషించిన మీదట ఎన్ని నూకలు వస్తాయి? ఎంత మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలో ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. నష్టపరిహారం ఖరారు విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే నెల రెండో వారం నాటికి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవుతాయని అంచనా. ప్రస్తుత సీజన్‌లో సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు సుమారు 32 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి ధాన్యం మార్కెట్‌లోకి రాకపోవచ్చని అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని