సజయ ‘అనువాద’ వైవిధ్యానికి..కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయను అనువాద రచనలో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ శుక్రవారం

Updated : 25 Jun 2022 05:54 IST

అశుద్ధ భారత్‌’ తెలుగు సేతను వరించిన గౌరవం
మహిళా, సామాజిక సమస్యలపై కలమెత్తిన ఉద్యమకారిణిగా గుర్తింపు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయను అనువాద రచనలో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లిషు సహా 22 భారతీయ భాషల్లో అనువాద రచనలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ.. మైథిలీ, రాజస్థానీ భాషల్లో అనువాద పురస్కారాలను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ను (నాన్‌ఫిక్షన్‌) సజయ ‘అశుద్ధ భారత్‌’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై ఆధారాల సహితంగా తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అనువాద రచన ఎంపికకు జ్యూరీ సభ్యులుగా
ప్రొఫెసర్‌ ఎస్‌.శేషారత్నం, వై.ముకుంద రామారావు, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు వ్యవహరించారు. అవార్డు కింద సజయకు రూ.50వేల నగదు, తామ్రఫలకం అందజేయనున్నారు. సజయ స్వగ్రామం కృష్ణా జిల్లా పెద్దముత్తేవి. మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. మహిళా సమస్యలపై ఆమె పోరాటాలు చేశారు.

ఇది నాకు లభించిన అవార్డు కాదు..

ఈ సందర్భంగా సజయ ‘ఈనాడు’తో మాట్లాడుతూ తాను ఎంచుకున్న అంశం తీవ్రమైందన్నారు. దేశవ్యాప్తంగా సఫాయి కార్మికుల సమస్య ఒకటుందని పాలకులు గుర్తించలేదన్నారు. దానిపై ఇప్పటికీ చిత్తశుద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇది తనకు లభించిన పురస్కారం కాదని, ఎంచుకున్న అంశం, పుస్తకాన్ని ప్రచురించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, తనకు సహకరించిన మరికొందరికి ఆ గౌరవం దక్కుతుందని వివరించారు.

విభిన్న రంగాల్లో ప్రతిభావని..

సజయ రచయిత్రిగా, అనువాదకురాలిగా, స్వతంత్ర పాత్రికేయురాలిగా, ప్రచురణకర్తగా, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌గా, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలు పోషిస్తూనే.. మహిళలు, ట్రాన్స్‌జెండర్ల సమస్యలు, యురేనియం తవ్వకాలు, భారత వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులపై పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. వాటిని ‘ప్రవాహం’, ‘రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు.

స్త్రీల ఆరోగ్య సమస్యలపై ‘సవాలక్ష సందేహాలు’ పుస్తకానికి కె.లలితతో,  ‘స్త్రీవాద రాజకీయాలు-వర్తమాన చర్చలు’ పుస్తకానికి ప్రొఫెసర్‌ రమా మెల్కోటేతో కలిసి సంపాదకత్వం వహించారు.

ప్రొఫెసర్‌ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘దళిత్స్‌ అండ్‌ ద మేకింగ్‌ ఆఫ్‌ మాడ్రన్‌ ఇండియా’ను ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు’ పేరిట తెలుగులోకి అనువదించారు.

వ్యవసాయ విధానాలపై సజయ రాసిన 51 వ్యాసాలకుగానూ 2017లో దక్షిణాసియా దేశాల విభాగంలో ‘లాడ్లీ మీడియా అత్యుత్తమ కాలమిస్ట్‌’ అవార్డు అందుకున్నారు.

‘అశుద్ధ భారత్‌’ పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి అనువాదంలో అత్యుత్తమ పురస్కారం అందజేసింది.

హైదరాబాద్‌లోని అన్వేషి రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్స్‌ స్టడీస్‌ సెంటర్‌లో 1989 నుంచీ సీనియర్‌ సభ్యులుగా సజయ కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని