Warangal : నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం

తెలంగాణతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి 7 రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని

Updated : 07 Jul 2022 10:24 IST

వరంగల్‌లో వారంపాటు కార్యక్రమాలు

హైదరాబాద్‌లో చిత్రకళా ప్రదర్శన

ముఖ్య అతిథిగా వస్తున్న కాకతీయుల వారసుడు

ఈనాడు, హైదరాబాద్‌, వరంగల్‌: తెలంగాణతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి 7 రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ దీనిని ప్రారంభించనున్నారు. ఈ వేడుకల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ కాకతీయ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. గురువారం ప్రారంభోత్సవాలు వరంగల్‌లో జరుగుతాయి. ఇదేరోజు సాయంత్రం హైదరాబాద్‌ మాదాపూర్‌లో కాకతీయుల పాలనకు సంబంధించిన 777 చిత్రాల ప్రదర్శనను మంత్రులు కేటీ రామారావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభిస్తారు. 8న వరంగల్‌లో కవి సమ్మేళనం, 9 నుంచి భద్రకాళి బండ్‌ వద్ద ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. 10న చిత్రకళా ప్రదర్శన, 11న లఘు చిత్రప్రదర్శనలు, 12న వరంగల్‌ నిట్‌లో మిషన్‌ కాకతీయ, కాకతీయుల సిద్ధాంతాలపై సదస్సులను నిర్వహిస్తారు. అదేరోజు వరంగల్‌ కోటలో కార్నివాల్‌ జరుగుతుంది. 13న రామప్ప ఆలయంలో ముగింపు వేడుకలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా నాటక సప్తాహం, శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలుంటాయి. ముగింపు వేడుకలకు మంత్రులు కేటీ రామారావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు హాజరు కానున్నారు.

ఘనంగా ఏర్పాట్లు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కాకతీయులకు తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉంది. వారి సేవలను, ఘనతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. వరంగల్‌లో పెద్దఎత్తున కార్యక్రమాలను జరుపుతున్నాం. హైదరాబాద్‌లోనూ ఉత్సవాలుంటాయి. అన్నిరంగాలకు చెందిన వ్యక్తులు, విద్యార్థులు, యువత భాగస్వాములయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

స్వాగతంలో రాచకళ..

కాకతీయ రాజుల వంశీయుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ను ఖిలా వరంగల్‌ కోటకు ఆహ్వానించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పడమర కోట ద్వారం నుంచి వేద పండితులు మంత్రాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. పలువురు సైనికుల వేషధారణలతో ముందు నడుస్తుండగా ఆయన గుర్రపు బగ్గీలో కూర్చుని పయనిస్తారు. ఆయన మధ్యకోట మీదుగా వెళ్లి కాకతీయుల నాటి పురాతన ఆలయం స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.


అమ్మ దగ్గరకు వస్తున్నట్లు అనిపిస్తోంది: కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌

తమ ముత్తాతలు పాలించిన నేలలో తొలిసారి అడుగుపెడుతున్నందున భావోద్వేగానికి గురవుతున్నానని, అమ్మ దగ్గరకు వస్తున్న భావన కలుగుతోందని కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ కాకతీయ అన్నారు. వేడుకలకు వస్తున్న నేపథ్యంలో ఆయనను ‘ఈనాడు’ ఫోన్‌లో పలకరించింది. ఇప్పటికే తమ పూర్వీకుల చరిత్రను అధ్యయనం చేశానని ఆయన చెప్పారు. వారసత్వ కట్టడాలను ప్రత్యక్షంగా సందర్శించబోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఉత్సవాలకు రావాలని చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారని చెప్పారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని