కోటి జెండాలతో పంద్రాగస్టు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8-22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ

Published : 28 Jul 2022 05:53 IST

వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేశవరావు

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8-22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ కేశవరావు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 15 రోజుల పాటు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్సవాలను ప్రారంభిస్తారని, ఆగస్టు 22న ఎల్బీస్టేడియంలో భారీ ఎత్తున ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తామని, దీని కోసం ప్రభుత్వం కోటి జెండాలు తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేస్తుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, సలహాదారు కేవీ రమణాచారి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులతో వజ్రోత్సవాల నిర్వహణపై ఆయన బీఆర్‌కేభవన్‌లో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరానికి తెలియజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.హెచ్‌ఐసీసీలో జరిగే ప్రారంభోత్సవాల్లో పోలీస్‌ బ్యాండ్‌, తదితర కళారూపాల ప్రదర్శన ఉంటుంది. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు ప్రదర్శిస్తాం. సినిమాహాళ్లలో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శింపజేస్తాం. హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్‌ మీదుగా సంజీవయ్య పార్కులోని జాతీయజెండా వరకు ర్యాలీ ఉంటుంది. అన్ని విద్యాసంస్థల్లో వక్తృత్వ, వ్యాసరచన సహా ఇతర పోటీలుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో ఒక రోజు భారీ ఎత్తున జానపదాల ప్రదర్శన...మరో రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఒకేమారు జాతీయ గీతాలాపన ఉంటుంది. 22న జరిగే ముగింపు వేడుకలకు ఒక్కో జిల్లా నుంచి రెండువేల మంది హాజరవుతారు. త్వరలో పూర్తి స్థాయి కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, రాజధాని నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు

ప్రత్యేకలోగో రూపకల్పన

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ చిహ్నంలోని అశోకచక్రం, రాష్ట్ర అధికారచిహ్నంలోని కాకతీయతోరణం, త్రివర్ణపతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని త్వరలో విడుదల చేయనున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారి వారి లెటర్‌ ప్యాడ్లమీద జాతీయపతాకంతో కూడిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల లోగోను ముద్రించుకోవాలని, ప్రచారమాధ్యమాలు సైతం పక్షం రోజుల పాటు ఈ చిత్రం ప్రదర్శించాలని ప్రభుత్వం కోరనుంది.


ఉపరాష్ట్రపతి ఎన్నికలపై త్వరలో తెరాస వైఖరి వెల్లడిస్తాం

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెరాస ఎలాంటి వైఖరిని అవలంబించాలనే దానిపై ఒకటి రెండురోజుల్లో సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని కేశవరావు తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొనడం లేదా తటస్థంగా ఉండడం అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. తెరాస ఇప్పటికీ భాజపా వ్యతిరేక వైఖరితోనే ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని