‘5జీ’ సేవల్లో ఐఐటీ హైదరాబాద్‌ ముద్ర!

భవిష్యత్తు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐఐటీ హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తోంది. 5జీ సేవలను అందుబాటులోకి తేవడంలోనూ ఈ సంస్థదే ప్రధాన భూమిక. ప్రధాని మోదీ అక్టోబరు 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు.

Updated : 01 Oct 2022 04:58 IST

దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేసిన పరిశోధకులు
నెల్లూరుకు చెందిన ఆచార్య కిరణ్‌కూచి పాత్ర కీలకం

ఈనాడు, సంగారెడ్డి: భవిష్యత్తు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఐఐటీ హైదరాబాద్‌ కీలకపాత్ర పోషిస్తోంది. 5జీ సేవలను అందుబాటులోకి తేవడంలోనూ ఈ సంస్థదే ప్రధాన భూమిక. ప్రధాని మోదీ అక్టోబరు 1న 5జీ సేవలను ప్రారంభించనున్నారు. దేశీయంగానే ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్‌ ఈ రంగంలో తనమైన ముద్ర వేసింది. గతంలో 3జీ, 4జీ సేవలను వాడుకునేందుకు భారత్‌ పూర్తిగా విదేశాలపైనే ఆధారపడింది. ఐఐటీ హైదరాబాద్‌లో సాగించిన పరిశోధనల కారణంగా దేశీయంగానే 5జీ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వీలుకలిగింది.

ఐఐటీ హైదరాబాద్‌లో 2016 నుంచి ‘5జీ’పై పరిశోధనలు మొదలయ్యాయి. ఇందుకు అవసరమైన మాసివ్‌ మిమో సాంకేతికతతో పాటు ఇతర వ్యవస్థలనూ ఇక్కడ అభివృద్ధి చేశారు. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ పరికరాలనూ రూపొందించారు. వీటిని దేశంలోనే ఉత్పత్తి చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. పారిశ్రామికంగా 5జీ సేవలను విస్తృతంగా వాడుకునేందుకు వీలుగా నారోబ్యాండ్‌-ఐవోటీ చిప్‌ను సిద్ధం చేశారు. దీంతో వైద్య ఆరోగ్యం, రవాణా, విద్యుత్తు.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తేవచ్చంటున్నారు. ఏడాదిలోగా చిప్‌ ఉత్పత్తి కానుంది.

‘6జీ’ దిశగానూ..

6జీ సాంకేతికత అభివృద్ధిలోనూ ఐఐటీ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. 5జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఇందులో స్పెక్ట్రమ్‌ సామర్థ్యాన్ని మూడింతలు పెంచగలిగారు. ఇందుకోసం మాసివ్‌ మిమో బేస్‌స్టేషన్‌ను ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది మే నెలలో విజయవంతంగా ఏర్పాటుచేశారు. దీనిద్వారా అధిక నాణ్యత గల వీడియోలు, ఆడియోలను పొందవచ్చు. రద్దీ రైల్వేస్టేషన్లు, సభలు, ఇతర ప్రాంతాల్లోనూ అంతరాయం లేకుండా నాణ్యమైన అంతర్జాల సేవలను వాడుకోవచ్చు.


పరిశోధనల్లో ‘కిరణం’..

ఐటీ హైదరాబాద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య కిరణ్‌కూచి ఈ పరిశోధనల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన నాయకత్వంలోనే పరిశోధనలు సాగుతున్నాయి. 2016లో ఐఐటీ ప్రాంగణంలో 5జీ బేస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత అభివృద్ధి ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేస్తుందని కిరణ్‌కూచి ‘ఈనాడు’కు వివరించారు. దిల్లీలో శనివారం నిర్వహించే కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ 5జీ రంగంలో చేసిన ఆవిష్కరణలను ప్రదర్శిస్తామన్నారు. వీటి గురించి ప్రధాని మోదీకి వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ సాంకేతికతను వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో వాడుకునే వీలుంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని