యజమాని ప్రీమియం చెల్లించకపోతే పాలసీదారు బాధ్యుడు కాదు

వేతనం నుంచి పాలసీ చెల్లింపు విధానంలో యజమాని సొమ్ము చెల్లించలేదన్న కారణంగా పాలసీ మొత్తాన్ని నిరాకరించడం తగదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఎల్‌ఐసీకి స్పష్టం చేసింది.

Updated : 02 Oct 2022 05:51 IST

పాలసీల మొత్తం వడ్డీతో చెల్లించండి

ఎల్‌ఐసీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: వేతనం నుంచి పాలసీ చెల్లింపు విధానంలో యజమాని సొమ్ము చెల్లించలేదన్న కారణంగా పాలసీ మొత్తాన్ని నిరాకరించడం తగదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఎల్‌ఐసీకి స్పష్టం చేసింది. కాంట్రాక్టు చట్టం ప్రకారం బీమా కంపెనీకి ఏజెంట్‌గా యజమాని ఉంటారని, యజమాని పొరపాటుకు పాలసీ మొత్తాన్ని నిరాకరించరాదంది. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వలసాల శంకర్‌ పలు బీమా పథకాలను తీసుకున్నారు. ఎస్‌ఎస్‌సీ కింద జీవిత బీమా పాలసీ తీసుకున్న శంకర్‌ 2010లో మరణించగా నామినీగా ఉన్న తల్లి వలసాల పోచమ్మ పాలసీ మొత్తానికి క్లెయిం చేశారు. కానీ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమె ఫిర్యాదు దాఖలు చేయగా, జిల్లా ఫోరం కొట్టేసింది. దీంతో పోచమ్మ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పీలుపై రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యురాలు మీనా రామనాథన్‌, జ్యుడిషియల్‌ సభ్యులు కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. వేతనం నుంచి వాయిదాలు రాకపోవడంతో పాలసీ గడువు ముగిసిపోయిందన్న ఎల్‌ఐసీ వాదనను తోసిపుచ్చింది. జాతీయ వినియోగదారుల కమిషన్‌తో పాటు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం యజమాని సొమ్ము చెల్లించకపోతే పాలసీని నిరాకరించరాదంది. వాయిదాలు అందని పక్షంలో పాలసీదారుకు నోటీసులు జారీచేసి సమాచారం ఇవ్వాలి. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పాలసీ మురిగిపోయిందని క్లెయిం నిరాకరించడం చెల్లదంది. ఎస్‌ఎస్‌సీ ద్వారా తీసుకున్న రెండు పాలసీల మొత్తం రూ.3.50 లక్షలను నామినీ అయిన తల్లి పోచమ్మకు 9 శాతం వడ్డీతోపాటు, ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఎల్‌ఐసీని ఆదేశించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని