శిక్షలో పక్షపాతం తగదు

విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Updated : 05 May 2024 04:58 IST

బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం తొలగింపుపై పునస్సమీక్షించండి
ఎస్‌బీఐకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. బ్యాంకు మేనేజర్లపై ఒత్తిడి చేసి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ చేయించారన్న ఆరోపణలపై ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ అప్పటి ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌ పీటీఎం గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో పలువురు బ్రాంచ్‌ మేనేజర్లు నకిలీ విద్యా రుణ మంజూరు పత్రాలు జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందంటూ హైదరాబాద్‌ ఎస్‌బీహెచ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 2016లో ‘ఏఏఈఆర్‌ఐ’ ప్రధాన కార్యదర్శి నిశిధర్‌రెడ్డి మెయిల్‌ పంపారు. దీని ఆధారంగా మౌలాలి బ్రాంచ్‌లో పనిచేస్తున్న పీటీఎం గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టి 2018లో తొలుత సస్పెండ్‌ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. మధ్యవర్తులు సాగర్‌, శ్రీనివాస్‌ పంపిన నకిలీ రుణ మంజూరు పత్రాలపై సంతకాలు చేయాలంటూ గ్రీన్‌పార్క్‌కాలనీ, పండర్‌గస్త్‌ రోడ్డు ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌ మేనేజర్లపై ఒత్తిడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

ఆయా మేనేజర్లు టి.భువనమోహన్‌, కె.చంద్రశేఖర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గోపాలకృష్ణపై చర్య తీసుకున్నారు. తాజాగా అన్ని రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి బ్యాంకు ఉన్నతాధికారుల చర్యను తప్పుబట్టారు. తన తొలగింపును సవాల్‌ చేస్తూ గోపాలకృష్ణ అప్పీలేట్‌ అథారిటీని ఆశ్రయించగా.. క్రమశిక్షణ సంఘం పేర్కొన్న అంశాలతోనే అప్పీలేట్‌ అథారిటీ నిర్ణయం తీసుకుందని, స్వయంగా రికార్డులు పరిశీలించకపోవడాన్ని తప్పుబట్టారు. సహనిందితులకు కేవలం వేతనంలో కోత వేసి.. ఒకరిని (గోపాలకృష్ణ) ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదన్నారు. సర్వీసు నుంచి తొలగింపు శిక్షకాకుండా మరేదైనా శిక్ష విధించేలా నిర్ణయం తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ఈ వినతిపత్రంపై 4 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌బీఐ ఉన్నతాధికారులను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని