‘ఆపరేషన్‌ కగార్‌’తో అమాయకుల ప్రాణాలు బలి

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు.

Published : 05 May 2024 04:30 IST

పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో.. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ, దేశంలోని మావోయిస్టులందరినీ 2024 నాటికల్లా మట్టుబెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొన్ని నెలల క్రితమే ప్రతినబూనారన్నారు. ఇందులో భాగంగానే దండకారణ్యంలో బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సాయుధ బలగాల కాల్పుల్లో మొత్తం 92 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 50 మంది ఆదివాసీ మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో ఇప్పటికైనా మారణహోమాన్ని ఆపకుంటే.. సంబంధిత విషయమై రాష్ట్రపతి, జాతీయ మానవహక్కులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనూరాధ, విరసం సభ్యుడు రాము, హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని