దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలు

ఒక్కసారి అనారోగ్యం బారినపడితే.. ఆసుపత్రులకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. కూడబెట్టిన సొమ్మంతా దవాఖానాలకే ధారపోయాల్సి వస్తోంది. అది కూడా సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితులూ ఎదురవుతున్నాయి.

Published : 26 Nov 2022 06:12 IST

రాష్ట్రంలో చికిత్సలకు కూడబెట్టిన డబ్బు నుంచే 77.7% ఖర్చు
దేశవ్యాప్తంగా క్యాన్సర్ల వైద్యానికి అధిక వ్యయం
జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2021లో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

ఒక్కసారి అనారోగ్యం బారినపడితే.. ఆసుపత్రులకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. కూడబెట్టిన సొమ్మంతా దవాఖానాలకే ధారపోయాల్సి వస్తోంది. అది కూడా సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితులూ ఎదురవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2021’ పలు అంశాలను వెల్లడించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో వైద్య ఖర్చుల సమాచారాన్ని పేర్కొంటూ నివేదికను విడుదల చేసింది. వైద్య చికిత్సలకయ్యే మొత్తంలో  తెలంగాణలో సగటున 77.7 శాతం దాచుకున్న డబ్బుల నుంచే ఖర్చు చేస్తున్నారు. అప్పులు చేసి బిల్లులు కట్టడం తెలంగాణ గ్రామీణంలో 16.3 శాతంగా.. పట్టణాల్లో 14.4 శాతంగా నమోదైంది.

* దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్యాన్సర్‌ వ్యాధులపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ఈ జబ్బు చికిత్సల కోసం గ్రామీణ భారతంలో రూ.56,996.. పట్టణాల్లో రూ.68,259 చొప్పున సగటున ఒక్కో రోగి ఏడాదికి ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత అధిక ఖర్చులు కార్డియోవాస్క్యులర్‌ జబ్బులు, కండరాలు, ఎముకల వ్యాధుల చికిత్సల కోసం వెచ్చించాల్సి వస్తోంది.

* ప్రసవం కోసం కాకుండా ఇతర జబ్బుల కోసం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందితే.. తెలంగాణలో సగటున రూ.26,461 అదనంగా జేబులోంచి ఖర్చవుతోంది. ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా చికిత్సలు పొందినా కూడా సొంతంగా రూ.6,868 ఖర్చు పెట్టాల్సి రావడం గమనార్హం.

* రాష్ట్రంలోని గ్రామీణంలో ఎటువంటి ఆరోగ్య బీమా వర్తించకుండా ఉన్నవారు 29 శాతం మంది కాగా.. పట్టణాల్లో 50.3 శాతం మంది ఉన్నారు. అయితే, ప్రభుత్వ బీమా పొందుతున్న వారు గ్రామీణంలో 70.3 శాతం కాగా.. పట్టణాల్లో 37.3 శాతం మంది ఉన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని