డిసెంబరులో యాసంగి ‘రైతుబంధు’ జమ

యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం సొమ్ము డిసెంబరులో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Published : 26 Nov 2022 04:40 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం సొమ్ము డిసెంబరులో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ కూడా అమలు చేసి తీరుతామన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.14.9 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మరో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ నిర్మిస్తున్న గోదాముల్లో తొలిగా పూర్తయిన నిర్మాణం ఇదే కావడం విశేషం. అనంతరం గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ వేదసాయిచందర్‌ అధ్యక్షతన జరిగిన సభలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో మినహా దేశంలో ఎక్కడా కొత్త గోదాములు నిర్మించడం లేదన్నారు. ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతుంటే రాష్ట్రంలో రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని, ఇది మనకు గర్వకారణమన్నారు. ఇందుకోసమే కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టామని, పంటల నిల్వకు శీతల గిడ్డంగులు సైతం నిర్మిస్తామని చెప్పారు.   కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, సంస్థ ఎండీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని