తారుమారు.. తకరారు!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సుమారు ఏడేళ్ల కిందట అధికారులు చేసిన తప్పిదం వల్ల భూమి రికార్డులు తారుమారైపోయాయి.

Published : 08 Feb 2023 03:43 IST

వక్ఫ్‌ భూముల స్థితి తప్పుగా నమోదు
కుమురం భీం జిల్లాలో 300 ఎకరాలు అన్యాక్రాంతం
ఆసిఫాబాద్‌లో ‘వక్ఫ్‌’వి కాకున్నా.. నిషేధిత జాబితాలోకి

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సుమారు ఏడేళ్ల కిందట అధికారులు చేసిన తప్పిదం వల్ల భూమి రికార్డులు తారుమారైపోయాయి. నిషేధిత భూమిని పట్టాగా చూపి.. పట్టా ఉన్న స్థలాలను నిషేధిత జాబితాలోకి ఎక్కించడంతో రెండు విధాలా నష్టం జరుగుతోంది. రెవెన్యూశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే 300 ఎకరాల వక్ఫ్‌ భూములు క్రమంగా పట్టాలుగా రూపాంతరం చెందాయి. దాదాపు రూ.30 కోట్ల విలువైన ఈ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోగా, మరోవైపు 35 ఎకరాల పట్టా భూముల్లో నివాసాలు ఏర్పరుచుకున్న వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. బాధితులు ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు.

ఇదీ నేపథ్యం..

వాస్తవానికి కుమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని వెల్గి రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబరు 21, 47, 58, 61, 74లో 300 ఎకరాల వక్ఫ్‌ భూములున్నాయి. కానీ వీటికి బదులు.. అధికారిక రికార్డుల్లో.. లక్ష్మిపూర్‌, ఆసిఫాబాద్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలో ఇవే సర్వే నంబర్లతో వక్ఫ్‌ భూములున్నట్లు తప్పుగా నమోదు చేశారు. లక్ష్మిపూర్‌ అనే రెవెన్యూ గ్రామం ఆసిఫాబాద్‌ మండలంలోనే లేదు. అధికారులు చేసిన ఈ తప్పిదం వల్ల ఆసిఫాబాద్‌ పట్టణంలోని 21, 47, 61, 58 సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. 61 సర్వే నంబరులో ఉన్న పైకాజీనగర్‌ ప్రాంతం జిల్లా కేంద్రానికి మధ్యన ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 250 వరకు కుటుంబాలుండగా, భారీగా భవనాలు నిర్మితమయ్యాయి. వారు కుటుంబ అవసరాల కోసం ఇళ్లు, ఇంటి స్థలం బ్యాంకులో కుదువ పెట్టుకుందామన్నా, విక్రయిద్దామన్నా వీలు కాని పరిస్థితి. అత్యవసరమైతే కేవలం బాండ్‌ పేపర్లపై తక్కువ ధరకు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

మరోవైపు వెల్గి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండే సర్వే నంబర్లలో వక్ఫ్‌ భూములు నిషేధిత జాబితాలో లేకపోవడంతో 300 ఎకరాలు రైతులు, స్థానిక రాజకీయ నాయకుల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇవి నిరంతరం చేతులు మారుతూనే ఉన్నాయి. అక్కడ ఎకరం ధర రూ.10 లక్షల వరకు ఉంది. రికార్డులను సరిచేయడం ద్వారా నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని, వక్ఫ్‌ భూములకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేక అధికారితో సర్వే చేయిస్తాం

వక్ఫ్‌ భూముల రికార్డులకు సంబంధించి పొరపాటు జరిగిన మాట వాస్తవమే. వీటిని సరిచేయడానికి వక్ఫ్‌ బోర్డు నుంచి ప్రత్యేక అధికారిని నియమించి సర్వే చేయిస్తాం. త్వరలో సమస్య పరిష్కరిస్తాం.

 రబ్బానీ, మైనారిటీ సంక్షేమాధికారి, కుమురం భీం జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు