పల్లెకు వెలుగేది?.. పయనించే వీలేది?

రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో రద్దు చేసినవాటిలో చాలావరకు పునరుద్ధరించలేదు.

Published : 20 Mar 2023 03:36 IST

ఆదాయ మార్గంలోనే ఆర్టీసీ ప్రయాణం
గ్రామాలకు దూరమవుతున్న ప్రజారవాణా సంస్థ
రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని ఊళ్లు 1497
ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్న పల్లె ప్రజలు
అధిక ఛార్జీల భారం.. ప్రమాదాల బెడద

రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో రద్దు చేసినవాటిలో చాలావరకు పునరుద్ధరించలేదు. తిరుగుతున్న వాటిలోనూ పలు బస్సులను ఆదాయ కోణంలో అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సుల్లో పాస్‌లు చూపి రాయితీతో ప్రయాణించిన విద్యార్థులు ప్రైవేటువాహనాల ఛార్జీలు భరించలేక విలవిల్లాడుతున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది, జీపులో 25 మందిని తీసుకెళ్తుండటంతో ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

 ప్రైవేటు వాహనాలే దిక్కు

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం సోమేశ్వరబండ నుంచి నిత్యం మండల కేంద్రానికి 300 మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. కొద్దినెలల క్రితం ఈ ఊరి బస్సు రద్దయ్యింది. దీంతో ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలో అత్యధికం మారుమూల గిరిజన ప్రాంతాలే. ఏ అవసరం వచ్చినా ఇచ్చోడకు వెళ్లాలి. భీంపూర్‌ నుంచి సిరికొండకు 20 కి.మీ. అక్కడి నుంచి ఇచ్చోడ మరో 15 కి.మీ. ఆర్టీసీ బస్సుల్లేక 60కి పైగా ప్రైవేటువాహనాలు ఇచ్చోడ-సిరికొండ మధ్య తిరుగుతున్నాయి. ఒక్కో జీపులో 25 మందికిపైగా ఎక్కించుకుంటుండటంతో బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరికొండతో పాటు ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు 100 మందికి పైగా ప్రైవేటు వాహనాల్లోనే ఇచ్చోడలో కాలేజీకి వెళ్లి వస్తారు. రోజూ రూ.50 ఛార్జీల భారం పడుతుండటంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది.

పెద్దపల్లి నుంచి ఓదెల, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాల్లోని మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. 30 కి.మీ.దూరం ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్న దేవునిపల్లికి..అదేవిధంగా ముత్తారం, గౌరెడ్డిపేటలకూ బస్సులేదు. రెండు, మూడు నెలలుగా అనేక బస్సులు రద్దవుతున్నాయి. వాటిలో సూర్యాపేట జిల్లాలో సంగెం-జగద్గిరిగుట్ట, తుంగతుర్తి-హన్మకొండ, కోడూరు-సూర్యాపేట, బండరామారం-సూర్యాపేట, తిరుమలగిరి-తాటిపాముల వంటి పలు సర్వీసులున్నాయి.వాటిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి డిపో మేనేజర్లకు పెద్దసంఖ్యలో వినతిపత్రాలు అందుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలంలో 22 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.

కొత్త బస్సులు లేక..

గ్రామీణ ప్రాంతాలకు సర్వీసుల రద్దుకు బస్సుల సంఖ్య తగ్గుతుండటం కూడా మరో కారణం. కాలం చెల్లుతున్న బస్సుల స్థానంలో అంతేస్థాయిలో కొత్త బస్సులను ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులతో ప్రవేశపెట్టలేకపోతోంది. 2015-16లో 10,446 బస్సులుంటే 2022 డిసెంబరులో ఆ సంఖ్య ఏకంగా 9092కి పరిమితమైంది. గత డిసెంబరులో ఉన్న 9653 బస్సులతో పోలిస్తే ఏడాదిలోనే ఏకంగా 561 బస్సులు తగ్గాయి. ఆర్టీసీ వర్గాలు మాత్రం రాష్ట్రంలో కొత్త రెవిన్యూ గ్రామాలు ఏర్పడిన కారణంగానే బస్సులు వెళ్లనివాటి సంఖ్య పెరిగిందని చెబుతున్నాయి.


ఎందుకు ఇలాంటి పరిస్థితి?

ఆర్టీసీ గతంలో లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు బస్సులు నడిపేది. అధ్వానపు రహదారుల్లోనూ బస్సులు తిరిగేవి. ఇప్పుడు మంచి తారు రోడ్లున్నా పల్లెవెలుగు బస్సులు వెళ్లని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏకంగా 1497 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఏటికేడు నష్టాలు పెరుగుతుండటంతో ఆర్టీసీ అధిక ఆదాయం వచ్చే రూట్లకే ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల మీదుగా ట్రిప్పులను రద్దు చేస్తోంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ఇటీవల  ట్రిప్పుల సంఖ్య పెంచారు. జిల్లాల్లో రీజినల్‌, డిపో అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.


ఛార్జీలు భరించే స్తోమత లేక..

ఈ అమ్మాయి పేరు కళ్యాణి. సిరికొండ గ్రామం. పక్షవాతంతో ఇంటికే పరిమితమైన తండ్రి. తల్లి కూలి పనికి వెళ్తేనే కుటుంబపోషణ. మంచి చదువుతో కుటుంబానికి అండగా ఉండాలని ఇచ్చోడలో డిగ్రీలో చేరింది. బస్సు లేదు. రోజు రూ.50 ప్రైవేటు వాహన ఛార్జీ భరించే స్తోమత లేదు. దీంతో రెండు, మూడు రోజులకోసారి కాలేజీకి వెళ్తోంది.


బస్‌ రూట్లు తగ్గుతున్నాయిలా..!

2021 డిసెంబరులో 3583 రూట్లలో బస్సులు తిరిగితే 2022 డిసెంబరు నాటికి 3025కి పరిమితమైంది. అంటే 558 రూట్లలో బస్సులను తొలగించారు. 2023 జనవరి నుంచి ఈ సంఖ్య మరింత పెరిగింది.


* ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ.. పేరుకు మండల కేంద్రం. కానీ బస్సు సౌకర్యమే లేదు. మండలం కాకముందు సిరికొండ నుంచి ఇచ్చోడకు ప్రతి గంటకు ఓ బస్సుండేది. తర్వాత ఉదయం, సాయంత్రానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రైవేటు వాహనాలే దిక్కు. ఛార్జీల భారం భరించలేక కొందరు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* జిల్లా కేంద్రం సూర్యాపేట నుంచి తుంగతుర్తికి 20 ఏళ్లుగా ఉన్న నైట్‌ హాల్ట్‌ బస్సును ఆర్టీసీ రద్దు చేసింది. ఈ మండలంలో పెద్ద గ్రామం, 12 వేల జనాభా ఉన్న గొట్టిపర్తికి ఇప్పుడు బస్సు సౌకర్యమే లేదు.


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని