ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించగలిగాం

టీఎస్‌ఆర్టీసీ నష్టాలను రూ.2,200 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించగలిగామని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు.

Updated : 20 Mar 2023 05:51 IST

కొత్తగా నియామకాలూ చేపడుతున్నాం
సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: టీఎస్‌ఆర్టీసీ నష్టాలను రూ.2,200 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించగలిగామని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకూ కష్టంగా ఉండేదని.. ఇప్పుడు ప్రతి నెలా వేతనాలు చెల్లించడం, కొత్త బస్సుల కొనుగోలు సహా నియామకాలూ చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఆర్టీసీలో కానిస్టేబుళ్లుగా నియమితులైన 166 మందికి కొండాపూర్‌లోని టీఎస్‌ఎస్‌పీ 8వ పోలీసు పటాలంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చేపట్టిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత కారుణ్యనియామకాల ద్వారా ఆర్టీసీలో 1606 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లలో 57 మంది మహిళలూ ఉండటం గర్వకారణమన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని దారిలోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఏడాదిన్నర కాలంగా తాము తీసుకున్న నిర్ణయాలతో నష్టాలను తగ్గించుకోలిగామని పేర్కొన్నారు. అంతకుముందు శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లు కవాతు ప్రదర్శించి గౌరవవందనం చేశారు. ఏరోబిక్స్‌, కరాటే విన్యాసాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శిక్షణకాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు సృజన్‌కుమార్‌, రమాదేవి, పూజిత, సాయికిరణ్‌లకు ట్రోఫీలను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని