పరిహారంపైనే ఆశలు.. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు

రాష్ట్రంలో కొన్నేళ్లుగా అకాల వర్షాలు, వరదలు, చెరువులకు గండ్లు, ప్రాజెక్టుల బ్యాక్‌వాటర్‌ తదితర కారణాలతో పంటలను నష్టపోతున్న వారికి తగిన ఆసరా అందడం లేదు.

Published : 22 Mar 2023 04:13 IST

సరిగా లేదని కేంద్ర బీమా పథకం నుంచి వైదొలిగిన రాష్ట్రం
ఇంకా కార్యరూపం దాల్చని రాష్ట్ర పథకం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్నేళ్లుగా అకాల వర్షాలు, వరదలు, చెరువులకు గండ్లు, ప్రాజెక్టుల బ్యాక్‌వాటర్‌ తదితర కారణాలతో పంటలను నష్టపోతున్న వారికి తగిన ఆసరా అందడం లేదు. రైతుబంధు, బీమా, ఉచిత కరెంటు తదితర పథకాల ద్వారా ప్రయోజనం కలుగుతున్నా.. పంటలు నష్టపోయిన సందర్భాల్లో మాత్రం సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. బీమా పథకాలు అమలు కాకపోవడం, పరిహారం చెల్లింపులు సరిగా జరగకపోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోందనే విమర్శలున్నాయి. ఈ సారైనా ప్రభుత్వం పరిహారంతో ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

బీమాకు దూరం

రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు కావడం లేదు. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రవేశపెట్టింది. మూడేళ్ల పాటు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ సమయలో పంట నష్టాలకు తగిన బీమా సాయం అందలేదు. దీనికి తోడు కొన్ని నిబంధనలు సాయానికి ప్రతిబంధకమయ్యాయి. వడగళ్ల వానలు, గాలుల వల్ల పంట నష్టం జరిగితే ఆశించిన పరిహారంలో 25% తక్షణమే చెల్లించాలన్న నిబంధనను కంపెనీలు పాటించలేదు. దీంతోపాటు ఇతర కారణాల వల్ల రైతుల్లో ఈ పథకంపై నిరాసక్తతత వ్యక్తమైంది. తమ కంటే బీమా కంపెనీలకే ఇది ప్రయోజనకరంగా ఉందనే భావనతో వారు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర పథకానికి బదులు ప్రత్యామ్నాయంగా మరో బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి.. ఫసల్‌ బీమా నుంచి 2020లో వైదొలగింది. ఆ తర్వాత వరుసగా పంట నష్టాలు సంభవిస్తున్నా.. బీమా పథకం అమలులో లేకపోవడం వల్ల రైతులకు ఆ సాయం అందడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్లతోపాటు ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఈ సారైనా తమకు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.


నివేదికలు రూపొందిస్తున్నా..

పంట నష్టాలు జరిగినప్పుడు వ్యవసాయాధికారులు సర్వేలు చేసి నివేదిక రూపొందిస్తున్నారు. నిబంధనల మేరకు రైతు భూవిస్తీర్ణంలో 33 శాతానికిపైగా నష్టం జరిగితేనే అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పరిహారం వస్తుందని రైతులు భావిస్తున్నా.. అదీ సత్వరమే మంజూరు కావడం లేదు. గత ఏడాది వరంగల్‌ జిల్లా నర్సంపేట డివిజన్‌లో 30 వేల ఎకరాల పంటనష్టంపై అంచనా వేసి పరిహారం కోసం వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అది ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు పంట నష్టాలకు కేంద్రం నుంచి సాయం అందడం లేదు.


వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో కొండాయిల్‌పల్లికి చెందిన రైతు రాదారపు రాజయ్య లక్షలు అప్పు తెచ్చి మిర్చి పండించారు. గత ఏడాది జనవరి 9, 10 తేదీల్లో కురిసిన వడగళ్ల వానతో మొత్తం పంట దెబ్బ తింది. అధికారులు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటి వరకు పరిహారం రాలేదు. ఆ రైతు పెట్టుబడి కోల్పోవడంతోపాటు రూ.మూడు లక్షల వడ్డీభారంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు..Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని