మురిసిన తెలంగాణం

తెలంగాణ రాష్ట్రమంతటా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయి.. పదో ఏట అడుగిడిన వేళ ఊరూరా సంబురాలు అంబరాన్నంటాయి.

Updated : 07 Jun 2023 15:27 IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు

తెలంగాణ రాష్ట్రమంతటా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయి.. పదో ఏట అడుగిడిన వేళ ఊరూరా సంబురాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా రాష్ట్రవ్యాప్తంగా పలుకార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌తో పాటు అన్నిజిల్లాల్లో సంబురాల్ని నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తొలిసారి హైదరాబాద్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది.

జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి .. అసెంబ్లీ ఆవరణలో, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనమండలిలో.. జాతీయజెండాను ఎగరేశారు. మంత్రులు కేటీఆర్‌ సిరిసిల్ల కలెక్టరేట్‌లో, హరీశ్‌రావు సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో, మహమూద్‌ అలీ సంగారెడ్డిలో, కొప్పుల ఈశ్వర్‌ జగిత్యాలలో, వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్‌లో, గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో, ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామలో, సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌లో, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, నిరంజన్‌రెడ్డి వనపర్తిలో, జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మెదక్‌లో, శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో, మల్లారెడ్డి మల్కాజిగిరిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిచ్‌పల్లిలోని 7వ పోలీస్‌ బెటాలియన్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ నర్సరీని ప్రారంభించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి మరింత ఘనంగా నిర్వహించాయి.


రాష్ట్ర ప్రగతిపై దేశమంతటాచర్చ

వేడుకల్లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోక వెనకబడిన తెలంగాణ... స్వరాష్ట్రంగా అవతరించాక అన్ని రంగాల్లో ముందుకెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. సీఎం కేసీఆర్‌ పటిష్ఠ కార్యాచరణ, ఆర్థిక క్రమశిక్షణతో రాబడి క్రమంగా పెరిగింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత వృద్ధి సాకారమైంది. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్‌డీపీ వృద్ధిరేటు 13.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 10.2 శాతానికి తగ్గింది. అందుకే ఈ అభివృద్ధి నమూనాపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. దేశ ప్రజలంతా దీన్నే కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దాన్నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తక్కువ సమయంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతోంది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా దాని ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెరగడంతోనే ఇది సాధ్యమవుతోంది. ఇక తలసరి ఆదాయం మన రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానం. 2013-14లో రూ.1.12 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2022-23లో రూ.3.17 లక్షలకు చేరిందని అంచనా. ఇది జాతీయ తలసరి ఆదాయం రూ.1.70 లక్షల కంటే 86% ఎక్కువ. ఈ గణాంకాలే తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతికి నిదర్శనాలు’’ అని వివరించారు.


తొమ్మిదేళ్లలో వందేళ్ల అభివృద్ధి

మంత్రి హరీశ్‌రావు

న్యూస్‌టుడే, సిద్దిపేట: తొమ్మిదేళ్ల ప్రగతి యాత్రను పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణాన రాష్ట్రంలో వందేళ్ల అభివృద్ధి ఆవిష్కృతమైందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో ఎన్ని అవరోధాలనైనా అధిగమిస్తామని, దశాబ్దిలో శతాబ్దపు కీర్తి ప్రతిష్ఠలను సాధించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వేదికగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. సిద్దిపేట శివారులో రూ.52 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో రెండు జాతీయ రహదారులు నిర్మాణమవుతున్నాయని, రైలు కల కూడా త్వరలోనే సాకారం కానుందని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రుతుప్రేమ కార్యక్రమానికి సిద్దిపేటలో శ్రీకారం చుట్టామన్నారు. అంతకుముందు మంత్రి రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద, డిగ్రీ కళాశాల సమీపంలోని ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

 


 

తెలుగులో ట్వీట్లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో ట్వీట్లు చేశారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

ఈనాడు, హైదరాబాద్‌


సుందర రాష్ట్రం.. ఆవిష్కరణల కేంద్రం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. పచ్చని పంటలు, అడవులు, వన్యప్రాణులతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమున్నత సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సుందరమైన రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా ఉద్భవిస్తోంది. అభివృద్ధి, సమృద్ధి నిరంతరం సాగాలని కాంక్షిస్తున్నా.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము


సంస్కృతీ వైభవం తెలంగాణ సొంతం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక్కడి ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నా.

ప్రధాని నరేంద్ర మోదీ


రాష్ట్రం సుభిక్షంగా సాగాలి

చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక్కడి ప్రజలు గొప్ప చరిత్ర, సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. ఈ పవిత్రమైన రోజు రాష్ట్రం మరింత సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.

హోంమంత్రి అమిత్‌షా


అపురూప హస్తకళలకు పేరు

అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం, అపురూపమైన హస్తకళా సంప్రదాయాలను తెలంగాణ ప్రజలు తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా


కలలు నెరవేర్చినందుకు గర్విస్తున్నాం

ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, కలల నుంచే దేశంలో అతిపిన్న వయసు రాష్ట్రంగా తెలంగాణ పుట్టుకొచ్చింది. వాటిని నెరవేర్చడానికి కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ పనిచేసినందుకు మేమెంతో గర్విస్తున్నాం.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


అద్భుత తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

భారత్‌లో అతి పిన్న వయసు రాష్ట్రమైన    తెలంగాణ అక్కడి ప్రజల దృఢ స్ఫూర్తికి నిదర్శనం. రైతులు, యువత, మహిళలకు సమృద్ధిని సాధించిపెట్టే ఆదర్శవంతమైన, అద్భుత రాష్ట్ర నిర్మాణానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ


తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తున్నా. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలని ఆశిస్తున్నా.

తెదేపా అధినేత చంద్రబాబు


ఎందరో యోధుల త్యాగఫలం..

ఎందరో పోరాటయోధుల ప్రాణత్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. పేదరికం లేని రాష్ట్రం ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తున్నా.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌


సామాజిక తెలంగాణే లక్ష్యం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

సామాజిక తెలంగాణ సాధించేందుకు ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయజెండా ఎగురవేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళి అర్పించి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.


సబ్బండ వర్గాల పోరాటంతోనే: కోదండరాం

సబ్బండ వర్గాల పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. కేసీఆర్‌ ఉద్యమ విలువలు, ఆకాంక్షలను మరిచిపోయారని కోదండరాం విరుచుకుపడ్డారు.


రాష్ట్ర ఏర్పాటులో తెదేపా లేఖ కీలకం: కాసాని

ప్రత్యేక తెలంగాణ సిద్ధించినా యువత, విద్యార్థులు ఆశించిన విధంగా అభివృద్ధి జరగడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా తెదేపా నిర్ణయం తీసుకుని లేఖ ఇవ్వడం.. రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమని కాసాని అన్నారు.


ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ ఉద్యమం : షర్మిల

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలని, సర్కారు మారితేనే బతుకులు మారతాయని వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల అన్నారు. లోటస్‌పాండ్‌లోని వైతెపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు