చేప ప్రసాదం పంపిణీ నేడే
మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
వేలాదిగా తరలివచ్చిన ఆస్తమా బాధితులు
కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం
నాంపల్లి, ఆబిడ్స్, న్యూస్‌టుడే: మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం 24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనుంది. గురువారం సాయంత్రం వరకే దేశం నలుమూలల నుంచి సుమారు 25 వేల మందికి పైగా ఆస్తమా బాధితులు తరలిరావడంతో మైదానం కిటకిటలాడుతోంది. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జీహెచ్‌ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. మత్స్యశాఖ 2.50 లక్షల కొర్రమీను చేపపిల్లలను సమకూర్చింది. బత్తిని కుటుంబీకులు సుమారు 5 లక్షల మందికి సరిపడేలా ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం అదనంగా గాంధీసెంటినరీ హాల్ వైపు అయిదు ప్రత్యేక కౌంటర్లు పెట్టారు. చేప ప్రసాదాన్ని గర్భిణులు మినహా అందరూ స్వీకరించవచ్చని బత్తిని కుటుంబీకులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.