ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది.

Updated : 24 Mar 2024 10:05 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర నిర్ధారణ
ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సహా ముగ్గురిపై ఎల్‌వోసీ జారీ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో,  తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్‌ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ఐన్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్రవణ్‌రావు సూచించిన ఫోన్‌ నంబర్లనే ప్రణీత్‌రావు ట్యాపింగ్‌ చేసినట్లు తేలడంతో అతడింట్లో జరిపిన సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నైలో ఓ పవర్‌ కంపెనీ పత్రాలు శ్రవణ్‌ ఇంట్లో గుర్తించారు. రాంపల్లిలోని ఓ స్కూల్‌ దస్తావేజులు లభ్యమయ్యాయి. రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, అయిదు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్‌ బృందం సొంత నిర్ణయాలు తీసుకొని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది.


నాడు రేవంత్‌రెడ్డి సహా కుటుంబసభ్యుల పైనా నిఘా..!

తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులకు సంబంధించిన ప్రొఫైళ్లు తయారుచేసి నిఘా ఉంచాల్సిన విధుల్లో ఉన్న ప్రణీత్‌రావు హద్దుమీరి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై దృష్టిపెట్టారు. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డితోసహా ఆయన కుటుంబసభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఈ వ్యవహారం సాగిందని.. అలాగే కొందరు ఎంపిక చేసిన భారాస నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు విచారణలో ప్రణీత్‌ తెలిపినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని