
MLC Elections: ఆరూ తెరాసకే!
మండలి స్థానాలకు నామినేషన్లు వేసింది ఆరుగురే
ఏకగ్రీవం కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీలు
ఆచితూచి ఎంపిక చేసిన సీఎం
చివరి నిమిషంలో జాబితాలోకి బండా ప్రకాశ్, వెంకట్రామరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి, కడియం శ్రీహరి,
గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఆరు స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆరుగురే నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం ఉదయం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డిలను ఖరారు చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితాలో చేరాయి.
వ్యూహాత్మకంగా ఎంపిక
అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు.మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం. విషయాన్ని వారికి కేసీఆర్ స్వయంగా ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే వారు ప్రగతిభవన్‌కు చేరుకోగా పార్టీ అభ్యర్థులుగా బి-ఫారాలు అందజేశారు.
నామినేషన్ల దాఖలు
అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులతో కలిసి అభ్యర్థులు శాసనసభకు చేరుకున్నారు. అక్కడ రిటర్నింగు అధికారి నర్సింహాచార్యులుకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఒక్కో సభ్యుడిని పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. పత్రాలను బుధవారం పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు గడువు ఉంది. ఏకగ్రీవమవుతున్నందున అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు అదేరోజు ప్రకటించి ధ్రువీకరణపత్రాలను జారీ చేయనున్నారు. షెడ్యూలు మేరకు 29న ఎన్నికలు జరగాల్సిన విషయం విదితమే.
ఆ సిఫార్సు వెనక్కి...
గవర్నర్ నామినేటెడ్ శాసనమండలి సభ్యత్వానికి పాడి కౌశిక్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొని గతంలో గవర్నర్ తమిళిసైకి పంపించింది. సామాజిక సేవల కేటగిరీలో ఆయన పేరును ప్రతిపాదించగా... దానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో గవర్నర్ ఆయన ఎంపికను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యేల కోటాకు మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆయన్ను నామినేటెడ్ కోటాకు చేసిన సిఫార్సును వెనక్కితీసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. ఆమె దానిని ఆమోదించడంతో కౌశిక్‌రెడ్డి ఎంపికకు మార్గం సుగమమయింది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల కృతజ్ఞతలు
తమ ఎంపికపై ఆరుగురు అభ్యర్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ప్రగతిభవన్‌లో వారిద్దరినీ కలిసిన వారు నామినేషన్ల దాఖలు అనంతరం తెలంగాణభవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
గవర్నర్ నామినేటెడ్ కోటాపై త్వరలో నిర్ణయం
గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న ఒక స్థానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెరాస శాసనసభా పక్ష సమావేశంలో మంత్రులు, నేతలకు తెలిపారు. కాగా... ఈ స్థానం కోసం మాజీ సభాపతి మధుసూదనాచారి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరుల పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్థానం
కడియం శ్రీహరి: వరంగల్ జిల్లా పర్వతగిరిలో 1952 జులై 8న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి బ్యాంకు మేనేజర్‌గా ఆ తర్వాత అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపు మేరకు తెదేపాలో చేరారు. 1994లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1999లోనూ విజయం సాధించి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2004 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2008 ఉపఎన్నికలో గెలిచారు. 2013లో కడియం తెరాసలో చేరారు. 2014లో వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాల్లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1954 ఫిబ్రవరి రెండో తేదీన జన్మించారు. బీఎస్సీ చదివారు. 1981లో పంచాయతీ ఎన్నికల్లో పోటీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షునిగా, సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌గా, జాతీయ పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి మండలి సంచాలకునిగా సేవలందించారు. 1999లో ఆయన తెదేపా తరఫున ఎంపీగా నల్గొండ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి అదే స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లోనూ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఆయన 2015లో తెరాసలో చేరారు. 2018లో రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ఆయన సెప్టెంబరులో శాసనమండలి ఛైర్మన్ అయ్యారు. జూన్ మూడో తేదీన ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసింది.
బండా ప్రకాశ్: వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు. ఎంఏ, పీహెచ్డీ చేశారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో తెరాసలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వెంకట్రామరెడ్డి: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో 1962 సెప్టెంబరు 21న జన్మించారు. 1996లో గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. బందరు, చిత్తూరు, తిరుపతిలలో ఆర్డీవోగా పనిచేశారు. 2007లో ఐఏఎస్ హోదా పొందారు. మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేశారు. సుదీర్ఘ కాలం సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు ఆయన సర్వీసు ఉంది. సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
పాడి కౌశిక్‌రెడ్డి: కరీంనగర్ జిల్లా వీణవంకలో 1984 డిసెంబరు 21న జన్మించారు. బీకాం చదివారు. రంజీ క్రికెట్లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు. 2018లో ఆయన కాంగ్రెస్‌లో చేరి, ఆ సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్‌లో పోటీ చేసి 34.60% ఓట్లను సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యదర్శి పదవిని పొందారు. ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసిన తర్వాత కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. హుజూరాబాద్ టికెట్‌ను ఆశించినప్పటికీ.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
తక్కెళ్లపల్లి రవీందర్రావు: మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో 1964 సెప్టెంబరు 9న జన్మించారు. డిగ్రీ చదివారు. విద్యాసంస్థలను ప్రారంభించారు. 1983లో తెదేపాలో చేరి.. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో తెరాసలో చేరారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు.
-ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్చల్
-
General News
PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు
-
India News
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం
-
General News
Chiranjeevi: భీమవరం చేరుకున్న చిరంజీవి.. అభిమానుల ఘనస్వాగతం
-
Business News
Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య