Hyderabad: ఏక్‌ ఫసల్‌ భూముల్లో ఏకంగా విల్లాలు.. ప్రజాప్రతినిధులవే అధికం

హైదరాబాద్‌ చరిత్రలో అంతర్భాగమైన జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలోనే కొందరు ప్రజాప్రతినిధులు... మాజీ ప్రజాప్రతినిధులు విల్లాలు.. ఫామ్‌హౌస్‌ల నిర్మాణం ప్రారంభించడమే దానికి నిదర్శనం.

Updated : 05 Nov 2022 09:16 IST

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌.టి.ఎల్‌. పరిధిలోనే నిర్మాణాలు
వాస్తవానికి ఇక్కడ ఒక పంట పండించుకోడానికే అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, బండ్లగూడజాగీరు: హైదరాబాద్‌ చరిత్రలో అంతర్భాగమైన జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) పరిధిలోనే కొందరు ప్రజాప్రతినిధులు... మాజీ ప్రజాప్రతినిధులు విల్లాలు.. ఫామ్‌హౌస్‌ల నిర్మాణం ప్రారంభించడమే దానికి నిదర్శనం. వాస్తవంగా బాహ్యవలయ రహదారి, విమానాశ్రయం అందుబాటులోకి రావడం, జలాశయాల పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో నేతలు ఈ భూములపై గతంలోనే కన్నేశారు. ముఖ్యంగా ఏక్‌ ఫసల్‌ పేరుతో ఉన్న దాదాపు రెండొందల ఎకరాల పట్టాభూములపై దృష్టి పెట్టారు.

హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరిసరాలు, నార్సింగి, బండ్లగూడజాగీరు ప్రాంతాల్లో ఏళ్లక్రితం నివాసమున్న పేదలు, రైతులకు ఇచ్చిన ఈ భూములను కొన్నారు. అయితే 111 జీవో అమలులో ఉండడంతో నిర్మాణాలకు వెనకడుగు వేస్తూ వచ్చారు. జీవో సవరణ నేపథ్యంలో కొద్దినెలల నుంచి ఈ పరిసరాల్లో నిర్మాణాలు ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టపగలే మట్టిని తరలించి జలాశయాలను పూడ్చేస్తున్నారు. కొంతమంది పోలీస్‌ అధికారులు కూడా దృష్టి పెట్టారు. వాస్తవానికి ఏక్‌ ఫసల్‌ భూములు అంటే జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఒకపంట మాత్రమే పండించాలన్న నిబంధనతో ఇచ్చేవి. నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.


111 జీవోను సవరించడంతో...

జంట జలాశయాల పరిధిని రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులు గతంలోనే నిర్ణయించారు. వర్షాకాలంలో జలాశయానికి ఎంత నీరు వస్తుందో అంచనా వేసి ఆ పరిధిని నిర్ణయించడాన్ని ఎఫ్‌.టి.ఎల్‌. అంటారు. దాని తర్వాత దాదాపు అర కిలోమీటరు వరకు బఫర్‌ జోన్‌ ఉంటుంది. అక్కడి వరకూ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. దీంతోపాటు జంట జలాశయాల పరిరక్షణకు జారీ చేసిన 111 జీవో అధికారుల నిర్ణయానికి మరింత పదును పెంచింది. దీంతో ఎఫ్‌.టి.ఎల్‌.ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా.. సరిహద్దు వరకు వెళ్లినా లేనిపోని ఇబ్బందులన్న భావనతో అక్రమార్కులు కొన్నేళ్ల క్రితం వరకూ మిన్నకుండిపోయారు. ఒకట్రెండు ఆక్రమణలున్నా... రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టేవారు. 111 జీవోను సవరించడంతో జంట జలాశయాల పరిసర ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, అతిథిగృహాలు... విల్లాలను నిర్మించుకునేందుకు కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ జీవోను సవరించినందున బఫర్‌ జోన్‌ దాటిన తర్వాత జీ+1 నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఎఫ్‌.టి.ఎల్‌. పరిధిలో కావడం గమనార్హం.


* ఒక మాజీ ఎంపీ హిమాయత్‌సాగర్‌లోని ఏక్‌ ఫసల్‌ భూములను కొద్దిరోజుల నుంచి చదును చేయిస్తున్నారు. అక్కడ ఫామ్‌హౌస్‌ నిర్మించాలని నిర్ణయించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని