Steve Jobs: రూ.1.78కోట్లకు అమ్ముడుపోయిన స్టీవ్‌ జాబ్స్‌ పాత పాదరక్షలు

యాపిల్‌ సహవ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ పాత చెప్పులు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. ఇటీవల వీటిని ఓ సంస్థ ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచగా.. 2లక్షల 18వేల డాలర్లకు వీటిని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని వేలం నిర్వహించిన జులియన్‌ అనే సంస్థ వెల్లడించింది.

Published : 17 Nov 2022 01:08 IST

కాలిఫోర్నియా: కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్‌లలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగిన యాపిల్‌ (Apple) సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ పాత చెప్పులను ఇటీవల వేలం వేశారు. అందులో 2లక్షల 18వేల అమెరికన్‌ డాలర్లకు (సుమారు రూ.1కోటి 78లక్షలు) వాటిని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అంచనా వేసిన దానికంటే ఎన్నో రెట్లకు స్టీవ్‌ జాబ్స్‌ పాత చెప్పులు అమ్ముడు పోయినట్లు వేలం వేసిన సంస్థ వెల్లడించింది.

అమెరికాకు చెందిన జూలియన్స్‌ అనే సంస్థ పలు వస్తువులను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. అందులో స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) వాడిన బిర్కెన్‌స్టాక్‌ ఆరొజోనా కంపెనీకి చెందిన లెదర్‌ చెప్పులను (Leather Sandals) ఉంచింది. 1970, 80 దశకంలో యాపిల్‌ కంప్యూటర్‌ రూపొందించే కీలక సమయాల్లో స్టీవ్‌జాబ్స్‌ వీటిని వాడారని పేర్కొంది. కొన్నేళ్లపాటు వాడినందున వాటిపై ఆయన కాలి ముద్రలు స్పష్టంగా ఉన్నాయని వివరించింది. వేలంలో వాటికి 60వేల డాలర్లు వస్తాయని ఊహించగా.. రికార్డు స్థాయిలో 2,18,750 డాలర్లకు అవి అమ్ముడు పోయినట్లు తెలిపింది. అయితే, వాటిని కొన్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

స్టీవ్‌ జాబ్స్‌, స్టీవ్‌ వోజ్‌నియాక్‌లు కలిసి కాలిఫోర్నియాలో 1976లో యాపిల్‌ సంస్థను స్థాపించారు. అనంతరం ప్రత్యేక బ్రాండుగా అవతరించి.. ప్రపంచంలోనే దిగ్గజ కంప్యూటర్‌ సంస్థగా ఎదిగింది. అయితే, క్లోమ గ్రంధి క్యాన్సర్‌తో బాధపడిన జాబ్స్‌.. 2011లో చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని