Bangladesh: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. రైలుకు నిప్పు

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పుపెట్టారు. ఆదివారం అక్కడ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది.

Updated : 06 Jan 2024 15:29 IST

ఢాకా: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament elections) జరగనున్న బంగ్లాదేశ్‌ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 7న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్‌ సరిహద్దుల్లో ఉన్న బెనాపోల్‌ పట్టణం నుంచి బయల్దేరిన బెనాపోల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఢాకాలోని కమలాపూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుండగా దుండగులు దాడి చేశారు. నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఘటన సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులున్నారు. వీరిలో అత్యధికులు ఎన్నికల కోసం భారత్‌ నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్నవారేనని రైల్వే అధికారులు వెల్లడించారు.

విమాన ప్రమాదం.. ఇద్దరు కుమార్తెలు సహా హాలీవుడ్ నటుడి మృతి

ఘటనపై దేశ ప్రధాని షేక్‌ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు దేశ ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్‌పీ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ విధ్వంసం కచ్చితంగా కుట్రపూరిత చర్యేనని, దీనిపై ఐరాస పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. గత డిసెంబరులోనూ బంగ్లాదేశ్‌లో రైలుకు దుండగులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్‌లో జనవరి 7న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు దాదాపు 120 మంది విదేశీ పరిశీలకులు ఇప్పటికే ఢాకా చేరుకున్నారు. వీరిలో భారత ఎన్నికల కమిషన్‌ నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక, ఎన్నికలు జరిగే వరకు ఏ పార్టీకీ సంబంధం లేని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ‘బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ’ (బీఎన్‌పీ) డిమాండ్‌ చేయగా.. షేక్‌ హసీనా ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ వరసగా నాలుగోసారి విజయం సాధించడం లాంఛనమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని