Canada: కన్నబిడ్డేనని గుర్తించక ఆస్పత్రిలో చేర్చింది.. ఆఖరుకు కడుపు కోతే మిగిలింది!

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువతిని.. ఓ మహిళ ఆస్పత్రికి తరలించింది. కొద్ది సేపటికి ఆ మహిళకు పోలీసులు ఫోన్‌ చేసి.. ‘మీ కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు’ అని సమాచారం ఇచ్చారు. దీంతో హతాశురాలైన ఆమెకు.. అంతలోనే మరో ఊహించని షాక్‌ తగిలింది. అదే.. ఇంతకుముందు తను ఆస్పత్రిలో చేర్పించిన యువతి తన కన్న కుమార్తెనే అని తెలియడం.

Published : 25 Nov 2022 01:36 IST

ఒటావా: కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువతి రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అంతలోనే అక్కడికి చేరుకున్న ఓ మహిళ.. ఆమెకు సపర్యలు చేసి, ఆస్పత్రికి తరలించింది. అడ్మిట్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమె వెంటే ఉంది. అనంతరం.. ఇంటికి చేరుకున్న ఆ మహిళకు పోలీసుల నుంచి ఓ ఫోన్‌ వచ్చింది. ‘మీ కుమార్తె ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు’ అని సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా హతాశురాలైన ఆమెకు.. అంతలోనే మరో ఊహించని షాక్‌ తగిలింది. అదే.. ఇంతకుముందు తను ఆస్పత్రిలో చేర్పించిన యువతి తన కన్న కుమార్తెనే అని తెలియడం.

కెనడాకు చెందిన జేమీ ఎరిక్సన్‌ ఓ వైద్యురాలు. నవంబరు 15న ఆమె అల్బర్టా రోడ్డులో వెళ్తుండగా.. మార్గమధ్యలో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి కనిపించింది. వెంటనే ఆమె.. బాధితురాలిని కారులోంచి బయటకు దించి, దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించే వరకు ఆమె వెంటే ఉన్నారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో బాధితురాలిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అనంతరం, విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఎరిక్సన్‌కు.. తన కుమార్తె మోంటానా(17) రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వార్త అందింది.

అప్పటికే దుఃఖంలో మునిగిపోయిన ఆమెకు.. ఆస్పత్రి, ఇతర వివరాలు తెలిసేసరికి ఖిన్నురాలయ్యారు. ‘ఇంతకుముందు నేను ఆస్పత్రిలో చేర్పించిన యువతి.. నా కుమార్తే. నా రక్తమాంసాలతో జన్మించింది’ అంటూ ఆమె పూడుకుపోయిన గొంతుతో కన్నీటిపర్యంతమయ్యారు! మోంటానా.. టాలెంటెడ్‌ స్విమ్మర్‌ అని, న్యాయశాస్త్రం చదవాలని ఆకాంక్షించినట్లు గుర్తుచేసుకున్నారు. అంత బాధలోనూ కుమార్తె అవయవ దానానికి ముందుకువచ్చారు. ‘మా బిడ్డ ఇతరులకు ప్రాణం పోస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆమె విషయంలో ఎంతో గర్వపడుతున్నాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని