China: అమెరికాలో ఆగిన తైవాన్‌ ఉపాధ్యక్షుడు.. రెచ్చిపోయిన చైనా

తైవాన్‌పై చైనా (China) మరోసారి బెదిరింపులకు పాల్పడింది. ఆ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది. యుద్ధ విమానాలతో డ్రిల్స్‌ నిర్వహిస్తోంది.

Updated : 19 Aug 2023 16:20 IST

బీజింగ్‌: చైనా - తైవాన్ (China-Taiwan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ద్వీపం చుట్టూ బీజింగ్‌ శనివారం సైనిక్‌ డ్రిల్స్‌ (military drills)ను ప్రారంభించింది. తైవాన్‌ (Taiwan) ఉపాధ్యక్షుడు విలియం లాయ్‌ చెంగ్‌-తె అమెరికా (USA)లో ఆగడమే ఇందుక్కారణం. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవ్వింపు చర్యలపై హెచ్చరిక గానే ఈ డ్రిల్స్ చేపట్టినట్లు చైనా రక్షణ మంత్రి వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌.. పశ్చిమ దేశాలతో తమ దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పరాగ్వే (Paraguay) పర్యటనకు వెళ్లిన తైవాన్‌ ఉపాధ్యక్షుడు విలియం లాయ్‌.. మధ్యలో శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ నగరాల్లో ఆగారు. అంతేగాక, అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో ‘తైవాన్‌ స్వతంత్ర దేశం’ అని లాయ్‌ పేర్కొన్నారు. ఇక, పరాగ్వేలోనూ అమెరికా అధికారులతో ఆయన చర్చలు జరిపారు.

‘అప్పుడే వినుంటే.. ఆ చిన్నారులు బతికేవారేమో’: రాకాసి నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు

అయితే ఈ ద్వీపం తమ దేశంలోని భాగమని చెబుతున్న చైనా.. లాయ్‌ పర్యటనపై గుర్రుమంది. ఇది పూర్తిగా అమెరికా, తైవాన్‌ అధికారిక డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కలిసి చేస్తున్న ‘రెచ్చగొట్టే చర్యే’ అని బీజింగ్‌ మండిపడింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు విదేశాలతో సంబంధాలు నెరిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలను ప్రారంభించింది. సైనిక బోట్లు, విమానాలను మోహరించింది. సైనికులతో డ్రిల్స్‌ చేపట్టింది. క్షిపణులను మోసే బోట్లు, యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నట్లు బీజింగ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

చొచ్చుకొచ్చిన యుద్ధ విమానాలు: తైవాన్‌

చైనా డ్రిల్స్‌ను తైవాన్‌ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘శనివారం ఉదయం నుంచి చైనా మిలిటరీకి చెందిన 42 యుద్ధ విమానాలు మా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి చొచ్చుకొచ్చాయి. 26 యుద్ధ విమానాలు తైవాన్‌ జలసంధి మధ్య లైన్‌ను దాటుకొని వచ్చాయి. ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్యే. చైనా సైన్యం నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు, మా స్వతంత్రతను కాపాడుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా బలగాలను కూడా మోహరించాం’’ అని తైవాన్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని